గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్-2 అభ్యర్థులు www.psc.ap.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది. మొత్తం 899 పోస్టులకు సంబంధించి 4 లక్షల 83 వేల 525 మంది ధరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కొక్క ఉద్యోగానికి 537 మంది పోటీపడుతున్నారన్న మాట.
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్క్రీనింగ్ పరీక్ష (జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ) నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులు ఒరిజినల్ గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని ఏపీపీఎస్సీ సూచించింది.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకొవాలని విజ్ఞప్తి చేసింది.