- కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్
- నిధులు ఇయ్యకపోవడంపై అసహనం
- సర్కారు నిర్లక్ష్య విధానంపై వివరణ ఇవ్వాలంటూ ఉత్తరాఖండ్ సీఎస్‌కు నోటీసులు
న్యూఢిల్లీ: రాష్ట్రంలో అడవులు కాలిపోతుంటే కంట్రోల్ చేయకుండా ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ఉత్తరాఖండ్ సర్కారుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంటలను అదుపు చేసేందుకు నిధులు కేటాయించకపోవడంపై మండిపడింది. ఓ పక్క అడివంతా కాలిపోతుంటే ఫారెస్ట్ ఆఫీసర్లకు ఎన్నికల డ్యూటీ ఎలా వేశారంటూ కేంద్ర ప్రభుత్వంపైనా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది నవంబర్ నుంచి ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఇప్పటివరకు 1,145 హెక్లార్ల విస్తీర్ణంలో అడివి కాలిపోయింది.
దీనిపై లాయర్ పరమేశ్వర్ పిటిషన్ వేయగా, సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఎన్వీఎస్ భట్టి, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన బెంచ్ బుధవారం విచారించింది. మంటలను అదుపు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య విధానంపై వివరణ ఇవ్వాలంటూ ఉత్తరాఖండ్ సీఎస్‌కు బెంచ్ నోటీసులిచ్చింది. శుక్రవారం కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. మంటలు కంట్రోల్ చేసేందుకు 9 వేలమందికిపైగా పనిచేస్తున్నారని రాష్ట్ర సర్కారు తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. కేంద్రాన్ని రూ.10 కోట్ల సాయం అందించాల్సిందిగా కోరితే రూ.3 కోట్లే ఇచ్చిందని చెప్పారు. దీంతో కేంద్రంపైనా కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
