యాపిల్ ప్రొడక్షన్ కెపాసిటీని ఇండియాకు తరలించనుందా?

యాపిల్ ప్రొడక్షన్ కెపాసిటీని ఇండియాకు తరలించనుందా?

న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ తోపాటు తన ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ కెపాసిటీలో ఐదో వంతును చైనా నుంచి ఇండియాకు తరలించాలని చూస్తోందని ఓ రిపోర్ట్ పేర్కొంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్ సెంటివ్స్ (పీఎల్ఐ) స్కీమ్ కింద ఇండియా గవర్నమెంట్ అందిస్తున్న ప్రయోజనాలను వాడుకుంటూ ఇక్కడ ప్రొడక్షన్ చేయాలని యాపిల్ భావిస్తోందని సదరు నివేదిక ప్రకారం తెలుస్తోంది. లోకల్ తయారీతోపాటు ఎగుమతులను ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ తరలింపుతో ఫాక్సాన్, విర్ స్టన్ లాంటి కాంట్రాక్టర్స్ సాయంతో 40 బిలియన్స్ విలువ చేసే ఐఫోన్స్ ను ఉత్పత్తి చేయాలని యాపిల్ వ్యూహాలు రచిస్తోంది. అలాగే ఇండియాను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఎక్స్ పోర్ట్ హబ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని యాపిల్ భావిస్తోందని సమాచారం.

యూఎస్ ట్రేడ్ టారిఫ్స్ తోపాటు కరోనా కారణంగా చాలా కంపెనీలు చైనాలో ప్రొడక్షన్ ను నిలిపివేయాల్సి వస్తోంది. అయితే ఈ రిపోర్ట్ పై యాపిల్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇండియా ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎల్ఐ స్కీమ్ లో కొన్ని బ్లాక్స్ ఉన్నాయని, వాటిని ప్రభుత్వం అధిగమించాల్సి ఉందని యాపిల్ పేర్కొన్నట్లు సమాచారం. ఇండియాలో ప్రస్తుతం యాపిల్ 1.5 బిలియన్ల విలువ చేసే ఐఫోన్స్ ను అమ్ముతోంది. వీటిలో మూడో వంతు కంటే తక్కువ స్థానికంగా తయారవుతున్నాయి.