న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కూడా క్రెడిట్ కార్డు వ్యాపారాల్లోకి దూకుతూ.. యాపిల్ కార్డును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎలాంటి నెంబర్, సీవీవీ సెక్యురిటీ కోడ్, ఎక్స్‌పైరీ డేట్, సిగ్నేచర్ అవసరం లేకుండానే ఈ కార్డును పట్టుకొచ్చింది. కానీ క్రెడిట్ లిమిట్స్ ఇవ్వడంలోనే తప్పులో కాలేస్తోంది. లింగ వివక్ష చూపుతూ క్రెడిట్ లిమిట్స్‌ను ఆఫర్ చేస్తోంది. దీంతో ఫైనాన్సియల్ సర్వీసెస్ న్యూయార్క్ డిపార్ట్‌మెంట్ దీనిపై విచారణ ప్రారంభించింది. యాపిల్ కార్డు జారీ దారు గోల్డ్‌మ్యాన్ శాచ్స్ క్రెడిట్ లిమిట్స్‌ను ఇవ్వడంలో లింక్ వివక్ష చూపుతుందని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఎంటర్‌ప్రెన్యూర్ డేవిడ్ హీన్మీయర్ హాన్సన్ పలు ట్వీట్లు చేశారు. ‘యాపిల్ కార్డు అనేది సెక్సిస్ట్ ప్రొగ్రామ్ లాంటిది. నేను, నా భార్య ఇద్దరం కలిసే ట్యాక్స్ రిటర్న్‌లను ఫైల్ చేస్తాం. చాలా ఏళ్ల క్రితమే మాకు పెళ్లి అయింది. ఒకే దగ్గర నివాసం ఉంటాం. కానీ ఆపిల్ బ్లాక్ బాక్స్ అల్గారిథమ్ మాత్రం ఆమె కంటే, నేను 20 రెట్లు క్రెడిట్ లిమిట్‌కు అర్హుడని భావిస్తోంది’ అని హాన్సన్ ట్వీట్ చేశారు.
యాపిల్ కార్డు గురించి…
గోల్డ్‌మ్యాన్ శాచ్స్, మాస్టర్‌కార్డుతో కలిసి యాపిల్ ఆగస్ట్‌లోనే ఈ కార్డును జారీ చేసింది. ఇది డిజిటల్, ఫిజికల్ క్రెడిట్ కార్డుగా ఉపయోగపడుతుంది. ఎలాంటి నెంబర్, సీవీవీ సెక్యురిటీ కోడ్, ఎక్స్‌పైరీ డేట్, కార్డుపై సిగ్నేచర్ అవసరం లేదు. ఈ కార్డు ద్వారా ఇన్‌స్టాంట్ అప్రూవల్స్, కొనుగోళ్లపై రోజూ క్యాష్‌బ్యాక్‌లు, జీరో ఫీజులు ఉంటాయి.
యాపిల్ కోఫౌండర్‌కూ ఇదే పరిస్థితి…
యాపిల్ కోఫౌండర్ స్టీవ్ వోజ్నియాక్ కూడా దీనిపై ఫిర్యాదు చేశారు. ‘నాకు కూడా ఇలానే జరిగింది. పదింతలు క్రెడిట్ లిమిట్ ఎక్కువగా నాకు వచ్చింది. మాకు వేరువేరు బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డు అకౌంట్లు లేదా సెపరేట్ ఆస్తులు లేవు’ అని వోజ్నియాక్ చెప్పారు. యాపిల్ కార్డుపై విచారణ జరుపుతామని న్యూయార్క్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ధృవీకరించినట్టు మార్కెట్ వాచ్ రిపోర్ట్ చేసింది. అయితే దీనిపై ఇంకా యాపిల్ స్పందించలేదు. తమ క్రెడిట్ నిర్ణయాలు, కస్టమర్ల ఖర్చు పెట్టగలిగే సామర్థ్యంపై ఉంటాయని గోల్డ్‌మ్యాన్ శాచ్స్ అధికార ప్రతినిధి చెప్పారు. దీనిలో ఎలాంటి లింగ వివక్ష, ఏజ్‌లో తేడాలు వంటివి ఉండవని పేర్కొన్నారు. బ్లాక్ బాక్స్ క్రెడిట్ అసెస్‌మెంట్ ఆధారంగా యాపిల్ క్రెడిట్ కార్డును ఆఫర్ చేస్తోంది.

