డిసెంబర్ 28 నుంచి ఈ బ్యాంకు సేవలు టెంపరరీగా బంద్.. UPI, ATM, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ఏవీ పనిచేయవ్..!

వరంగల్: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి వరంగల్లో ప్రెస్మీట్ నిర్వహించి కీలక విషయాన్ని వెల్లడించారు. ఇప్పటివరకూ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులుగా ఉన్నవి కాస్తా 2025 జనవరి నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకులుగా మారనున్నట్లు ఆయన తెలిపారు.

‘‘వన్ స్టేట్-..వన్ ఆర్ఆర్బీ’’ (One State One Regional Rural Banks Policy) సంకల్పంతో ముందుకెళుతున్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఉత్తర్వుల మేరకు ఏపీజీవీబీకు సంబంధించిన 493 శాఖలు తెలంగాణ గ్రామీణ బ్యాంకు(టీజీబీ)లో 2025, జనవరిలో విలీనం కానున్నట్లు ఆయన వివరించారు. హైదరాబాద్లోని టీజీబీ హెడ్ ఆఫీస్ కింద ఏపీజీవీబీ బ్రాంచ్లు కార్యకలాపాలు నిర్వహించనున్నాయని చెప్పారు.

సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం బ్యాంక్ ఆపరేషన్స్, ఆన్ లైన్ బ్యాంకింగ్ సర్వీస్లు (UPI, ATM, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైనవి) డిసెంబర్ 28 నుంచి తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆయన వెల్లడించారు. 

 

జనవరి 1వ తేదీ నుంచి తిరిగి అన్ని సర్వీసులు పునరుద్దరించబడతాయని, డిసెంబర్ 27వ తేదీలోగా తమ లావాదేవీలను పూర్తి చేసుకుని ఖాతాదారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖాతాదారుల ఖాతా నంబర్లు అలాగే ఉంటాయి కాబట్టి గ్రామీణ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఎవరూ ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఖాతాదారులకు తెలిపారు.