మోడీకి కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ ఆంధ్రుల హక్కు మీద లేదు: వైఎస్ షర్మిల

 విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలేనని, స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమనేనని APCC చీఫ్  వైఎస్ షర్మిల విమర్శించారు.  మోడీకి కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ ఆంధ్రుల హక్కు మీద లేదని తీవ్ర విమర్శలు చేశారు.  విశాఖ స్టీల్ ను దివాలా తీయించే ఎత్తుగడలు సాగుతూనే ఉన్నాయని,- మోడీ సన్నిహితులకు పదో పరక కింద అమ్మే కుట్రలు జరుగుతూనే ఉన్నాయన్నారు. 
 
 ప్రైవేటీకరణ లేదు అంటూనే రూపాయి సహాయం చేయకుండా  ప్లాంట్ ను మూసేసే కుట్ర కేంద్రం చేస్తుందన్నారు.  కేంద్ర ఉక్కుశాఖ మంత్రి HD కుమారస్వామి ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో  కర్ణాటక స్టీల్ ప్లాంట్ కి రూ.15వేల కోట్ల సహాయం అందించి ఆ స్టీల్ ప్లాంట్ ను బ్రతికించారని అన్నారు. కేవలం 243 మంది పనిచేసే కర్ణాటక స్టీల్ ప్లాంట్ కు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన  కేంద్రానికి.. 26 వేల మంది పనిచేసే విశాఖ స్టీల్ ను ఆదుకోవడానికి మనసు లేదని విమర్శించారు. 

ALSO READ | TTD News: జనవరి 10 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు .. ఎప్పటివరకంటే..

ఇద్దరు ఎంపీలు ప్రాతినిథ్యం ఉండే JD(S)..రూ.15వేల కోట్లు నిధులు రాబట్టుకుంటే..  NDAకు ఊపిరి పోసిన టీడీపీ,- జనసేన పార్టీలు మోడీకి సలాం కొడుతున్నాయని..  18 మంది ఎంపీలు కేంద్రానికి గులాంగిరి చేస్తున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో  జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ముడిసరుకు కొరతతో ఉత్పత్తి తగ్గిందని, - ప్లాంట్ దివాలా తీసే స్థాయిలో ఉందని, కేంద్రం తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించి ఆదుకోవాలని కోరారు. కార్మికులు 1400 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే  ముఖ్యమంత్రి చంద్రబాబు మోడీతో మిట్టల్ స్టీల్ గురించి చర్చ చేస్తున్నారని మండిపడ్డారు. 
 
-వైజాగ్ స్టీల్ కు కేంద్రం నిధులు ఇవ్వాలని.. ప్లాంట్ ను SAILలో వెంటనే విలీనం చేయాలని డిమాండ్ చేశారు. 7 మిలియన్ టన్నుల ఉత్పత్తి ప్రారంభించి..  భవిష్యత్తులో 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి  సామర్థ్యం పెంచాలని సూచించారు. - ఇవి సాధించడం చేతకాకపోతే వెంటనే NDA భాగస్వామ్యం నుంచి టీడీపీ, జనసేనలు తప్పుకోవాలని డిమాండ్ చేశారు.