తాగునీటి విడుదలకు అనుమతివ్వండి, కేఆర్‌‌ఎంబీకి ఏపీ వినతి

హైదరాబాద్, వెలుగు: తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి 5500 క్యూసెక్కుల  నీటిని విడుదల చేసుకునేందుకు అనుమతివ్వాలని కృష్ణా రివర్ మేనేజ్‌‌మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు ఏపీ విజ్ఞప్తి చేసింది. నిరుడు సెప్టెంబర్‌‌లో జరిగిన మీటింగులో వివిధ దశల్లో 5 టీఎంసీల నీటిని సాగర్ రైట్ కెనాల్ ద్వారా విడుదల చేసుకునేందుకు బోర్డు త్రీమెంబర్ కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తుచేసింది. ఈ మేరకు బుధవారం కేఆర్‌‌ఎంబీకి ఏపీ లేఖ రాసింది. నాలుగో స్పెల్‌‌లో భాగంగా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల అవసరం కోసం తాగునీటి ట్యాంకులను నింపుకునేందుకు అనుమతివ్వాలని కోరింది. అందుకు అనుగుణంగా ఏపీ అధికారులు రైట్ కెనాల్ నుంచి నీటి విడుదలను ఆపరేట్ చేసేందుకు కేఆర్‌‌ఎంబీ సిబ్బంది, సీఆర్‌‌పీఎఫ్ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.