నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ( డిసెంబర్ 10) రాత్రికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 15వ తేదీ వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు.. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించింది.
చెన్నైలోని కొన్ని ప్రాంతాలు, దాని శివారు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 12, 13 తేదీల్లో తమిళనాడులోని దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.