తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ రతన్ టాటా విగ్రహం ఇదే..

తెలుగు రాష్ట్రాల్లోనే మొట్ట మొదటి రతన్ టాటా విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. సోమవారం (6 జనవరి 2025) పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో  రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రతన్ టాటా సేవలను కొనియాడారు. విద్యార్థులు రతన్ టాటా ను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ప్రతి నెల రూ.4 వేల కోట్లతో ప్రభుత్వం నడుస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ఈ సంక్షోభాన్ని విద్యా్ర్థులు అవకాశంగా మలచుకొని బాగా రాణించాలని సూచించారు. 

కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలను మార్చాలని భావిస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో పాఠ్య పుస్తకాల్లో రాజకీయ నాయకుల ఫోటోలు, పార్టీల రంగులు లేవని, ఆ పిచ్చి తమకు లేదని అన్నారు. విద్యార్థులు అన్ని విషయాల్లో అవగాహన పెంచుకోవాలని, మార్పు రావాల్సింది చట్టాల్లో కాదని ..అవగావన పెంచుకోవడంలో రావాలని అన్నారు. 

సమాజాన్ని చూసే కోణం మారాలని, ఆడ, మగ విషయాల్లో సమానత్వం రావాలని చెప్పారు. పాఠ్యాంశాల్లో ఆ అంశాలు ప్రతిబింబించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. డ్రగ్స్ వ్యసనం యువతరాన్ని నాశనం చేస్తుందని, అందుకోసం ‘నో డ్రగ్స్ క్యాంపెయిన్’ రూపొందించామని తెలిపారు. విద్యార్థులు అటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.  ‘డ్రగ్స్ వద్దు బ్రో.. డోంట్ బీ ముఖేష్’ అంటూ మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.

పరిపాలనలో విద్యాశాఖ చాలా కష్టమైన శాఖ అని, కష్టమైన శాఖలను ఎంచుకోవడం తనకు ఇష్టమని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా అన్నారు. కష్టకాలంలో తమతో నిలబడిన వారితో కలిసి వెళ్లాలని పార్టీ కార్యక్తలకు సూచించారు.