నెల్లూరు: ఓ అవినీతిపరుడ్ని అరెస్ట్ చేస్తే.. టీడీపీ గగ్గోలు పెడుతుందని అన్నారు ఏపీ మంత్రి అనిల్ కుమార్. ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఆయన మాట్లాడుతూ.. కార్మికుల మందుల కొనుగోళ్లల్లో భారీ ఎత్తున అవినీతి జరిగినట్టు విచారణలో వెల్లడైందని అన్నారు.
అవినీతి చేశాడని అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేస్తే.. దానికి కూడా చంద్రబాబు బీసీ కార్డు వాడుతున్నాడన్నారు. రాజకీయ ఎదుగుదలకు బీసీలను వాడుకున్న చరిత్ర చంద్రబాబుది అని అనిల్ విమర్శించారు. బీసీలకు ఎల్లప్పుడూ అండగా ఉండేది వైసీపి ప్రభుత్వమేనని, రాజకీయ స్వలాభం కోసం బీసీలను అణగదొక్కిన నీచ చరిత్ర చంద్రబాబుదని అన్నారు.
అచ్చెన్నాయుడు అరెస్ట్ తో చినబాబు, పెదబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు మంత్రి అనిల్. అవినీతిపరుడైన అచ్చెన్నాయుడుని టీడీపీ నేతలు జ్యోతిరావు పూలే లాగా భావిస్తే.. అది వారి అజ్ఞానానికే వదిలేస్తున్నామన్నారు. అరెస్ట్ పై టీడీపీ నేతలు రోడ్డెక్కి నిరసన చేయడం సిగ్గుచేటని అన్నారు. స్కామ్ లో అచ్చెన్నాయుడు పాత్ర లేకపోతే బయటికి వస్తాడని, ఎవరు తప్పు చేసినా.. ప్రభుత్వం ముందు అందరూ సమానులేనని అన్నారు.

