అవినీతి దొంగలు అన్నిశాఖల్లోనూ ఉన్నారు.. తొందర్లోనే బయటకొస్తారు
కార్మికశాఖలో రూ.300 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీ గుర్తించింది –గుమ్మనూరు జయరామ్
విజయవాడ: ఈ ఎస్ ఐ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు పై కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరామ్ స్పందించారు. ఆర్సీ, నాన్ ఆర్సీ.. టెలి సర్వీసుల్లో స్కాం చేసి అడ్డగోలుగా దొరికిపోయారన్నారని మీడియాతో అన్నారు. కార్మిక శాఖలో మొత్తం 300 కోట్లు అవకతవకలు జరిగినట్లు ఏసీబీ గుర్తించిందని పేర్కొన్న ఆయన.. ఇందులో రూ.150కోట్ల వరకు అచ్చెన్నాయుడు పాత్ర ఉన్నట్లు ఆధారాలు దొరికాయని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కార్మికశాఖకు అచ్చెన్నాయుడు కొంత కాలం.. పితాని సత్యనారాయణ మరికొంత కాలం ప్రాతినిధ్యం వహించారని గుర్తు చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్నిశాఖల్లో అవినీతి జరిగిందని… స్వయానా మంత్రులే అవినీతికి పాల్పడ్డారనేందుకు తొలి రుజువు అచ్చెన్నాయుడే… అచ్చెన్నాయుడుతోపాటు మరికొందరు జైలు పాలు కావడం ఖాయమన్నారు. టీడీపీ అవినీతి పరిపాలన ఆధారాలు వెలుగులోకి రావడం అచ్చెన్నాయుడుతో ప్రారంభమైందని.. ఇది ఆరంభం మాత్రమే.. అన్ని శాఖల్లో అవినీతి దొంగలున్నారు.. తొందర్లోనే అందరూ బయటకొస్తారని గుమ్మనూరు జయరామ్ చెప్పారు. 
