ఏపీ డెసిషన్ ఏంటి..: ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ఉంచుదామా.. ఎత్తేద్దామా..!

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా.. ఏపీలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేయాలని ఇంటర్ బోర్డ్ ప్రతిపాదించింది. సీబీఎస్ఈ పరీక్షల మాదిరిగా ఇంటర్ రెండేళ్ల కోర్సులో ఒకసారే.. అంటే సెకండ్ ఇయర్లోనే ఎగ్జామ్స్ నిర్వహించే యోచనలో ఏపీ ఇంటర్ బోర్డ్ ఉంది.

సీబీఎస్ఈలో 12వ తరగతిలో మాత్రమే.. అంటే సెకండియర్లో మాత్రమే ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో తప్ప చాలా రాష్ట్రాల్లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించడం లేదని, అందువల్ల.. ఏపీలో కూడా ఇంటర్ సెకండియర్లో ఎగ్జామ్స్ నిర్వహించాలని బోర్డ్ ప్రతిపాదించిందని తెలిసింది. అయితే.. ఈ నిర్ణయాన్ని నేరుగా అమలు చేయడం కంటే ప్రజాభిప్రాయ సేకరణ చేయడం మేలని ఏపీ సర్కార్ భావిస్తోంది. 

అందుకే.. బుధవారం నుంచి జనవరి 26 వరకూ ఇంటర్ ఫస్టియర్ కు పబ్లిక్ పరీక్షలు అవసరమో.. కాదో.. అనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. మార్చితో విద్యా సంవత్సరం ముగుస్తోంది. ఏప్రిల్‌, మే నెలల్లో ఎలాగూ జూనియర్ కాలేజీలకు సెలవులు ఇస్తారు. అందుకే.. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఏపీలో ఇంటర్ సెకండియర్ లో మాత్రమే పరీక్షలు నిర్వహించే నిర్ణయాన్ని అమలుచేయాలని ఏపీ ఇంటర్ బోర్డ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇలా చేయడం వల్ల.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించినట్టు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.