హైదరాబాద్, వెలుగు : ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో సంస్కరణలు తీసుకురావాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. దీంట్లో భాగంగా ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలను రద్దు చేయాలని యోచిస్తోంది. ఏపీలో ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్లో ఐదు అకాడమిక్ రీఫామ్స్ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ను ఏపీ ఇంటర్ వెబ్ సైట్ bieap.gov.in లో పెట్టారు. సీబీఎస్ఈలో మాదిరిగానే సెకండియర్ లో మాత్రమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించే అంశాన్ని పేర్కొన్నారు. దీనిపై ఇంటర్ బోర్డు సెక్రటరీ కృతికా శుక్లా మీడియాతో మాట్లాడారు.
పదేండ్లుగా ఇంటర్ ఎడ్యుకేషన్లో ఎలాంటి మార్పులు చేయలేదని.. ఇప్పుడు సిలబస్, పరీక్షల విధానంలో మార్పులు చేయాలని యోచిస్తున్నామని చెప్పారు. దీనికి సంబందించి ప్రపోజల్స్ వెబ్ సైట్లో పెట్టామని, ప్రజలు, విద్యార్థులు, పేరెంట్స్ ఈనెల 26 వరకు తమ అభిప్రాయాలను biereforms@gmail.com కు పంపించాలని సూచించారు. సిలబస్, పుస్తకాల రివిజన్స్, కొత్త సబ్జెక్టులు, మార్కెటింగ్ కు అనుగుణంగా ఎగ్జామినేషన్స్ విధానం , తదితర అంశాల్లో మార్పులు చేసేందుకు ప్రపోజల్స్ పెట్టారు.