డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన హోంమంత్రి అనిత.. కీలక అంశాలపై చర్చ..

ఏపీ హోంమంత్రి అనిత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిశారు అనిత. ఈ సమావేశంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, దీపావళి నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లు సహా పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 185 అగ్నిమాపక స్టేషన్లు, సిబ్బంది ఎక్కడ ప్రమాదం జరిగినా అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలిచ్చామని తెలిపారు మంత్రి అనిత. 100 లేదా 101 నంబర్లకు ఫోన్ లు చేసి టపాకాయల అక్రమ తయారీపై పోలీస్, ఫైర్ వ్యవస్థలకు ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏడిద గ్రామం తరహా దీపావళి టపాకాయల పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. వాయు కాలుష్యం దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలో దీనిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు.కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకటించిన 'దియాజలావ్' కార్యక్రమం తరహాలో ఏపీలోనూ ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు పవన్ కళ్యాణ్.

ఎకో ఫ్రెండ్లీ టపాకాయలకు పెద్దపీట వేస్తూ దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియాకు సంబంధించి తాజా పరిస్థితులపై ఆరా తీశారు. ప్రస్తుతం డయేరియా కేసుల నమోదు తగ్గిందని పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు వెల్లడించారు హోంమంత్రి అనిత. ఇటీవల రాష్ట్రంలో విమానాలలో బాంబు బెదిరింపులపైనా హోంమంత్రిని అడిగి వివరాలు తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్.

ALSO READ | Kapil Dev: ఏపీ సీఎం చంద్రబాబుతో కపిల్‌దేవ్ భేటీ

వైసీపీ హయాంలో జరిగిన అరాచక పరిస్థితులు, ఇటీవల బయటికి వస్తున్న దుర్మార్గాలపై చట్టప్రకారం వేగంగా దర్యాప్తు చేసి, నిందితులను శిక్షించేలా చూడాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నిర్వహణ పట్ల ప్రశంసలు కురిపించారు పవన్ కళ్యాణ్. నేరాల నియంత్రణలో మొబైల్ ఫోన్ వినియోగించాలని.. హోంమంత్రి ప్రజల భాగస్వామ్యం కోరడాన్ని అభినందించారు పవన్ కళ్యాణ్.