గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష వాయిదాపై APPSC కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్: గ్రూప్-2 పరీక్ష వాయిదాపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2025 జనవరి నెలలో జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ మంగళవారం (నవంబర్ 12) అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం 2025, జనవరి 5వ తేదీన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. 

అయితే, పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు తగిన సమయం లేదని ఆందోళన వ్యక్తం చేసిన అభ్యర్థులు.. గ్రూప్-2 ఎగ్జామ్‎ను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల నుండి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రూప్-2 పరీక్షను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ మంగళవారం అఫిషియల్‎గా ప్రకటించింది.

 జనవరి 5వ తేదీన జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను 2025, ఫిబ్రబరి 23వ తేదీకి వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్‎ను  సంప్రదించాలని కమిషన్ సూచించింది. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.