మే 11 నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష పేప‌ర్ల స్పాట్ వాల్యుయేషన్

మే 11 నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష పేప‌ర్ల స్పాట్ వాల్యుయేషన్

అమరావతి : మే 11 నుండి రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ (స్పాట్ వాల్యుయేషన్ ప్రోసెస్ ) ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో మే 11 నుండి, లాక్ డౌన్ ముగిసిన అనంతరం రెడ్ జోన్ ల‌లో మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించాలని మంత్రి అధికారుల‌కు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు అనుసరించి, కోవిడ్-19 జాగ్రత్తలను పాటిస్తూనే మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని మంత్రి సురేష్ వెల్లడించారు. మూల్యాంకన ప్రక్రియ ముగిసేదాకా కేటాయించిన భవనాల్లో సిబ్బందికి కావలసిన భోజనం, వసతి ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూల్యాంకన ప్రక్రియ పాదర్శకంగా, నాణ్యమైనదిగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. ప్రతిరోజూ ఉదయం 8 గం.ల నుండి మధ్యాహ్నం 1 గం. వరకు ఒక షిప్టు, మధ్యాహ్నం 1 గం. నుండి సాయంత్రం 6 గం.ల వరకు మరో షిప్టులో మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందన్నారు.

జూన్ చివరి నాటికి ఇంటర్మీడియట్ బోర్డు వెబ్ సైట్ లో విద్యార్థులకు ఆన్ లైన్ లో థియరీ క్లాసులు, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో పాఠాలు, ప్రాక్టికల్స్ కు సంబంధించిన వీడియోలు పొందుపరుచనున్నామని ఆయ‌న తెలిపారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ లో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామిన్ వి. రమేష్ , 13 జిల్లాల ఆర్ఐఓలు, ఆర్జేడీలు, డీవీఈఓ లు పాల్గొన్నారు.