అమరావతి: ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలనుద్ధేశించి మంగళవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేసిన ప్రసంగంలో 3 రాజధానుల అంశం ప్రస్తావనకు వచ్చింది. పరిపాలన వికేంద్రీకరణ అత్యంత కీలకమని వ్యాఖ్యానించిన ఆయన, అన్ని ప్రాంతాల అభివృద్ధే తన ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లు శాసన ప్రక్రియలో ఉందని అన్నారు. మూడు రాజధానులకు తన ప్రభుత్వం కట్టుబడివుందని తెలిపారు. అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్య నిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయని అన్నారు.
‘‘మా పాలనలో పరిపాలన వికేంద్రికరణ కీలక అంశం. మూడు రాజధానుల విభజనకు చట్టబద్దమైన ప్రక్రియ కొనసాగుతోంది. అమరావతి శాసన రాజధానిగా, విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా’’ ఉంటుందని గవర్నర్ ప్రసంగించారు. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని.. నిర్మించి తీరుతామని అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకే సాగుతామనే సంకేతాలు ఇచ్చారు.భవిష్యత్తులో తన ప్రభుత్వానికి మంచి రోజులు వస్తాయని, ఈ బిల్లు కూడా ఆమోదం పొందుతుందని ఆయన అన్నారు.

