విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

స్కూళ్ళు తెరిచే సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై మధ్యాహ్న భోజనం మరింత నాణ్యతతో రుచికరంగా అందించేందుకు చర్యలు మొదలు పెట్టింది.ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని తాజ్ హోటల్ లో పనిచేసే చెఫ్ లతో మధ్యాహ్న భోజనం వండే సిబ్బందికి ట్రైనింగ్ ఇప్పించింది. పప్పు, వెజ్ కర్రీ, పులిహోర, పొంగల్, పప్పుచారు, వంటి వంటకాల తయారీపై ట్రైనింగ్ ఇచ్చారు తాజ్ హోటల్ చెఫ్ లు.

మరోవైపు తిరుపతి తాజ్ హోటల్ చెఫ్ లతో మధ్యాహ్న భోజనం రుచికరంగా చేసేందుకు అవసరమయ్యే టిప్స్ తో వీడియోలను కూడా రూపొందించింది ప్రభుత్వం. సదరు వీడియోలలో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటలను ఎలా తయారు చేయాలో వివరించటంతో పాటుగా వాటి వల్ల కలిగే లాభాల గురించి కూడా చెఫ్‌లు వివరిస్తారు. ఈ విడిఓలను పాఠశాల విద్యాశాఖ నిర్వహించే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో అప్లోడ్ చేశారు.