ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డీఏను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయానికి కొన్ని గంటల ముందే ఈ మేరకు జీవోను విడుదల చేసింది జగన్ సర్కార్. పెండింగ్ ఉన్న డీఏను విడుదల చేయాలంటూ ఉద్యోగులు చాలా కాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మార్చి నెలలో పెండింగ్ డీఏను విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు ఎన్నికల కోడ్ అమలుకు కొన్ని గంటల ముందే జీవో జారీ చేసి మాట నిలబెట్టుకుంది.

పెండింగ్ ఉన్న డీఏ విడుదలతో పాటుగా సచివాలయ ఉద్యోగులకు అమరావతి ప్రాంతంలో స్థలాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అమరావతిలోని పిచ్చుకపాలెం గ్రామ పరిధిలో ఉద్యోగులకు స్థలాలు కేటాయిస్తున్నట్లుగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన జీవోలో పేర్కొన్నారు. 2019లో ఇచ్చిన జీవోలోని నిబంధనల ప్రకారమే స్థలాలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.