పాక్ జైళ్ల నుంచి భారత్‌ చేరుకున్న ఏపీ మత్స్యకారులు

పాక్ జైళ్ల నుంచి భారత్‌ చేరుకున్న ఏపీ మత్స్యకారులు

14 నెలల పాటు పాకిస్తాన్ జైల్లో ఉన్న ఆంధ్రా మత్స్యకారులు భారత్‌కు చేరుకున్నారు. వాఘా సరిహద్దు దగ్గర పాక్  రేంజర్లు 20 మంది మత్స్యకారులను బీఎస్‌ఎఫ్‌కు అప్పగించారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ మత్స్యకారులకు స్వాగతం పలికారు. పొట్టకూటి కోసం గుజరాత్‌ వలస వెళ్ళిన  ఆంధ్రా జాలర్లు 2018 డిసెంబర్‌లో పొరపాటున గుజరాత్‌ తీరం దగ్గర పాకిస్తాన్‌ జలాల్లోకి ప్రవేశించడంతో పాక్ సైన్యం వారిని అరెస్ట్‌ చేసింది. పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ దృష్టికి ఈ విషయాన్ని  YCP నేతలు, బాధితులు తీసుకొచ్చారు. తక్షణమే విడుదలకు కృషి చేయాల్సిందిగా వైఎస్‌ జగన్‌.. ఎంపీ విజయసాయిరెడ్డికి ఆదేశాలిచ్చారు. అప్పటి నుంచి  విదేశాంగ శాఖపై ఎంపీ విజయసాయిరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆంధ్ర జాలర్లను విడిచిపెట్టాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి పలుమార్లు ఆయన లేఖలు రాశారు. పాకిస్తాన్‌తో చర్చలు జరిపి ఆంధ్రా జాలర్లను విడిపించేందుకు చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.

జాలర్లకు ఇదొక పునర్జన్మ అని అన్నారు మంత్రి మోపిదేవి వెంకటరమణ. మత్స్యకారులను రేపు(మంగళవారం) ఉదయం అమృత్ సర్ నుంచి విమానంలో ఢిల్లీకి తరలించి…ఆ తర్వాత సాయంత్రం ఢిల్లీ నుంచి స్వస్థలాలకు తరలిస్తామని తెలిపారు. అంతేకాదు వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో ఇద్దరు మత్స్యకారుల విడుదల ఆగిపోయిందని..త్వరలో వారిని కూడా విడిపిస్తామని చెప్పారు మంత్రి మోపిదేవి.

వాఘా బోర్డర్ వద్ద భారత్‌లోకి ప్రవేశిస్తున్న మత్స్యకారులు