ఏపీ ఫైబర్ నెట్ నుండి 410 ఉద్యోగులు ఔట్.. జీవి రెడ్డి సంచలన నిర్ణయం..

ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 410 ఫైబర్ నెట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు జీవి రెడ్డి. ఏపీ ఫైబర్‌నెట్ ప్రక్షాళన దిశగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ( డిసెంబర్ 24, 2024 ) మీడియా సమావేశం నిర్వహించిన జీవీ రెడ్డి ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. వైసీపీ హయాంలో అర్హత లేని వారిని నియమించారని.. వైసీపీ నేతల ఆదేశాలతో అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. ఈ క్రమంలో వైసీపీ హయాంలో అక్రమంగా నియమించిన 410 మందితో పాటు మరో  200 మందిని కూడా తొలగిస్తున్నట్లు తెలిపారు జీవి రెడ్డి.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2016 నుండి 2019 మధ్య ఏపీ ఫైబర్ నెట్ లో 108 మంది ఉద్యోగులు ఉంటే.. 10 లక్షల కనేజేషన్లు ఉండేవని.. వైసీపీ హయాంలో 2019 నుండి 2024 మధ్య ఉద్యోగుల సంఖ్య 1360కి పెరిగినా కూడా కనెక్షన్లు 5 లక్షలకు పడిపోయాయని అన్నారు. వైసీపీ నియమించిన వారిలో కొంతమంది అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకుల ఇళ్లల్లో పనిచేశారని.. వారికి ఫైబర్ నెట్ నుంచి వేతనాల పేరిట కోట్ల రూపాయల దుర్వినియోగం చేశారని మండిపడ్డారు జీవి రెడ్డి.

ALSO READ | ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దన్నారని.. షూ లేస్‌తో ఉరి వేసుకుని బాలుడు ఆత్మహత్య

వైసీపీ నిర్వాకంతో ఏపీ ఫైబర్ నెట్ దివాళా తీసే పరిస్థితికి వచ్చిందని.. ఉద్యోగులకు లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరతామని అన్నారు. ఇకపై ఫైబర్ నెట్ అవసరాల మేరకు మాత్రమే ఉద్యోగులను తీసుకుంటామని స్పష్టం చేశారు జీవి రెడ్డి.