వీళ్లు మాములోళ్లు కాదు: రూ.10 కోట్ల బెట్టింగ్ డబ్బుతో మధ్యవర్తులు పరార్

ఏపీ ఎన్నికల్లో బెట్టింగ్ కోట్లకు పడగలెత్తిన విషయం అందరికీ విదితమే. కూటమి గెలుస్తుందని కొందరు, వైసీపీదే మరోసారి అధికారమని మరికొందరు పందేలు కాశారు. ఇవికాకుండా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయ్! పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ మెజారిటీ ఎంత? కుప్పం, పులివెందుల స్థానాలపై లక్షల్లో పందేలు కాశారు. వీటి పుణ్యమా అని కమిషన్ రూపంలో మధ్యవర్తిగా ఉన్నవారు నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా.. కమిషన్ చాలదనుకున్న కొందరు మధ్యవర్థులు పందెం కాసిన డబ్బుతో పరారైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

బెట్టింగ్ డబ్బుతో పరార్

పల్నాడు జిల్లా, నరసరావుపేటలో పలువురు మధ్యవర్థులు పందెం కాసిన డబ్బుతో పరారయ్యారు. కొందరు బెట్టింగ్ రాయుళ్లు.. రొంపిచర్ల మండలం పరగటిచర్లకి చెందిన ఆదినారాయణ అనే ఆయనను మధ్యవర్తిగా నమ్మి ఏడు కోట్ల రూపాయలు నగదు ముట్టచెప్పారట. ఫలితాలు వచ్చే ముందురోజు వరకూ వారి వెంటే ఉన్న ఆదినారాయణ.. ఫలితాలు రాగానే కనిపించకుండా పోయారట. ఇలాంటి ఘటనలు మరో రెండు వెలుగు చూశాయి. రొంపిచర్ల గ్రామానికి చెందిన వెంకయ్య అనే మధ్యవర్తి కోటిన్నరతో పరారు కాగా, నరసరావుపేట మండలం దొండపాడుకు చెందిన మరో మధ్యవర్తి కోటి రూపాయలతో ఉండాయించాడు.  
  
ఉన్నట్టుండి మధ్యవర్తులు, వారి కుటుంబసభ్యులు కనపడకుండా పోవడం.. ఫోన్లు స్విచ్చాఫ్ ఉండటంతో పందేలు కాసిన వారు లబోదిబో మంటున్నారు. బెట్టింగ్ కాయడం నిషేధం కనుక పోలీసులకు చెప్పుకోలేని పరిస్థితి. దీంతో పందేలు కాసిన వారు మధ్యవర్తుల ఇళ్ల ముందర తిష్ట వేశారు. వీరిలో కొందరు పొలాలు తాకట్టు పెట్టి బెట్టింగ్ కాసినట్లు వినికిడి.