AP Elections 2024: ఈవీఎంలు ధ్వంసం.. పల్నాడులో పలు చోట్ల ఉద్రిక్తత

పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామం( పోలింగ్ బూత్ నెంబర్. 251)లో వైసీపీ నాయకులు ఈవీఎంను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరో ఘటనలో రెంటచింతల జెట్టిపాడులో ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈ రెండు చోట్ల పోలీసులు భారీ సంఖ్యలో మొహరించినట్లు తెలుస్తోంది. పోలింగ్ ముగియడానికి చివరి గంటలు కావడంతో ప్రశాంతంగా ముగిసేలా ఈసీ చర్యలు చేపడుతోంది.

కాగా, ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరగడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తీవ్రంగా పరిగణించారు. గుంటూరు జిల్లాలోని తెనాలి, పల్నాడు జిల్లాలోని మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటలకు బాధ్యులైన వారిని వెంటనే గృహ నిర్బంధంలో ఉంచడంతో పాటు కేసులు నమోదు చేయాలని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు.