అమరావతి: మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్‌ను కలిసి హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సిందిగా కోరాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కోర్టు ఆదేశించింది. తాము ఇచ్చిన తీర్పు ప్రకారం ఎన్నికల కమిషనర్‌ను నియమించే అవకాశం గవర్నర్‌కు ఉందని చెప్పామని హైకోర్టు తెలియజేసింది.
సుప్రీంకోర్టులో మూడు సార్లు విచారణ జరిగినా స్టే రాలేదని రమేష్ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్టే ఇవ్వలేదు కాబట్టి, తాము ఇచ్చిన తీర్పు అమల్లో ఉన్నట్లేనని హైకోర్టు పేర్కొంది. ధర్మాసనం తీర్పు అమలు జరపాల్సిందేనని, ఈలోపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని కోర్టు సూచించింది. అనంతరం వచ్చే శుక్రవారానికి విచారణను వాయిదా వేసిన హైకోర్టు…ఈలోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
