హైకోర్టుకు‌ హాజరైన  ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

హైకోర్టుకు‌ హాజరైన  ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

విజయవాడ: మద్యం అక్రమరవాణా కేసులో సీజ్ చేసిన వెహికల్స్ ను విడుదల చేసే అంశంపై  హైకోర్టులో జరిగిన విచారణకు డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు.  వాహనాల విడుదలలో అధికారులు నిబంధనలు పాటించడంలేదని పిటిషనర్ తరపున న్యాయవాది డిఎస్ఎన్వీ ప్రసాద్ బాబు ఫిర్యాదు పై హైకోర్టు స్పందించింది. డిజిపి కోర్టుకు హజరు కావాల్సినంత కేసు ఇది కాదు.. కానీ కోర్టుకు ఎవరైనా సమానమే అని 17 వ కోర్టు జడ్జి దేవానంద్ ఆదేశించడంతో డీజీపీ స్వయంగా హాజరయ్యారు. డిజిపి గౌతమ్ సవాంగ్ నిజాయితీ, నిబద్ధత కలిగిన కలిగిన ఆఫీసర్ అని నాకు తెలుసు.. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొని విధులు నిర్వహిస్తున్నారని న్యాయమూర్తి దేవానంద్ పోలీస్ శాఖను అభినందించారు. డిజిపికి అడ్వకేట్ జనరల్, ప్రభుత్వ తరుపు న్యాయవాదుల సరిగా గైడ్ చేయడం లేదని జడ్జి దేవానంద్ అన్నారు. SEB లో కింది స్థాయిలో ఉన్న చిన్నచిన్న లోపాలను సరిచేసుకోవాలని సూచించారు.  ప్రభుత్వం వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలపై  ప్రభుత్వం తరుపున న్యాయవాదులు సరైన విధంగా గైడ్ చేయడం లేదన్నారు. ప్రభుత్వ న్యాయవాదుల వ్యవహార శైలి కారణంగా హైకోర్టు, ప్రభుత్వానికి వ్యతిరేకం అనే అభిప్రాయం  ప్రజలలోకి వెళుతోందని..  ఇది ఎవ్వరికీ మంచిది కాదని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు సమాచారం. కేసుల్లో వున్న వాహనాలు ఆయా శాఖలకు అప్పగించాలని మెమో జారీ చేశామని డిజిపి గౌతమ్ సవాంగ్ కోర్టుకు తెలియజేశారు.