రేషన్ బియ్యం స్మగ్లింగ్​ను  అడ్డుకోకుండా ఏం చేస్తున్నరు? :  డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • షిప్పు చూసేందుకొస్తే నన్నే తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తరా?
  • కాకినాడ పోర్టు అధికారులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్

అమరావతి: కాకినాడ పోర్టును బియ్యం స్మగ్లింగ్​కు హబ్‌‌‌‌గా మార్చారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌‌‌‌ కల్యాణ్‌‌‌‌ ఆరోపించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 51 వేల టన్నుల రేషన్‌‌‌‌ బియ్యం పట్టుకున్నామని వెల్లడించారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమ రవాణా అవుతుండగా సీజ్ చేసిన  640 టన్నుల రేషన్‌‌‌‌ బియ్యాన్ని పవన్ శుక్రవారం స్వయంగా వెళ్లి పరిశీలించారు.

రేషన్‌‌‌‌ బియ్యం రవాణా అవుతుంటే అడ్డుకోకుండా నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తున్న కాకినాడ పోర్టు అధికారులపై సీరియస్ అయ్యారు. అనంతరం అక్కడే ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాకినాడ పోర్టు రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు అడ్డాగా మారింది. బియ్యం ఎగుమతులకు కీలకమైన ఈ పోర్టుకు రోజూ వెయ్యి నుంచి 1,100 లారీలు వస్తాయి. కానీ, వాటి తనిఖీలకు కేవలం కేవలం 16 మందిని నియమించడం ఏంటి? పోర్టులో జరిగే చట్ట విరుద్ధ కార్యకలాపాలను అధికారులు ఎంత మేర అడ్డుకుంటున్నారో దీన్ని బట్టే అర్థమవుతున్నది.

కాకినాడ పోర్టు అనేది అక్రమ ఎగుమతులకు, స్మగ్లింగ్ కోసం అనుమతిచ్చింది కాదు. ఇది చట్ట ప్రకారం చేసే ఎగుమతులకు మాత్రమే నిలయం మాత్రమే.  గత రెండు నెలలుగా కాకినాడ పోర్టుకు రాకుండా నన్ను అడ్డుకున్నారు. మీరు వస్తే కొత్త సమస్యలు వస్తాయని చెప్పారు. కానీ, ఈ రోజు పరిస్థితిని పరిశీలించడానికి స్వయంగా వచ్చాను " అని పవన్ వివరించారు. రేషన్ బియ్యంతో పట్టుబడిన స్టెల్లా ఎల్ అనే షిప్ ను చూపెట్టమని అధికారులను అడిగితే, వారు తనను షిప్పు ఎక్కనివ్వకుండా ఏవేవో కారణాలు చెబుతూ అక్కడక్కడే తిప్పారని అధికారులపై మండిపడ్డారు. 

కసబ్ లాంటోడు వస్తే పరిస్థితి ఏంటి?

కాకినాడ పోర్టులో అసలు సరైన భద్రతే లేదని పవన్ వెల్లడించారు. "తీర ప్రాంతంలో భద్రత లోపిస్తే చాలా ప్రమాదం. బియ్యమే ఇంత ఈజీగా అక్రమంగా రవాణా చేస్తుంటే..టెర్రరిస్టులు మాత్రం చొరబడకుండా ఎలా ఉంటారు. ఒక వేళ కసబ్ లాంటోడు వస్తే పరిస్థితి ఏంటి?”అని ప్రశ్నించారు. కాకినాడ పోర్టు పరిస్థితిని, బియ్యం అక్రమ రవాణాపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తానని వెల్లడించారు. కాగా, రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టమన్నారు. మొత్తం నెట్ వర్క్​ను నాశనం చేస్తామని చెప్పారు.