పల్నాడులో పర్యటించిన పవన్.. భూములు లాక్కున్నారంటూ ఆగ్రహం..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం పల్నాడు జిల్లా మాచవరంలో పర్యటించారు. ఇందులోభాగంగా మాచవరంలో సరస్వతి పవర్ భూములను పరిశీలించారు. అనంతరం ప్రజలతో మాట్లాడుతూ దివంగత శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సరస్వతి పవర్ భూముల సేకరణకు బీజం పడిందని, సరస్వతి పవర్ కంపెనీలో వైఎస్ కుటుంబానికి 86 శాతం వాటా ఉందని అన్నారు. 

సరస్వతి పవర్ కోసం తీసుకున్న భూముల్లో వేమవరంలో 710.06 ఎకరాలు, చెన్నాయపాలెంలో 273 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 93.79 ఎకరాలు, తంగెడ గ్రామంలో 107.36 ఎకరాలతో సహా మొత్తంగా రైతుల వద్ద నుంచి 1184 ఎకరాలు తీసుకోగా ఇందులో పట్టా భూమి 1043.75 ఎకరాలు ఉంటే, చుక్కల భూమి 75 ఎకరాలు ఉందని అన్నారు.

అయితే గత ప్రభుత్వ హయాంలో ప్లాంట్ నిర్మాణం కోసం ప్రజల నుంచి భూములు లాక్కున్నారని, ఇవ్వని వారిపై పెట్రోల్ పోసి దాడులకు పాల్పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మరికొందరి నుంచి ఉద్యొగాలు ఆశ చూపించి భూములు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వడం మర్చిపోయారని దీంతో జీవనాధారం కోల్పోయి ప్రజలు రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్వతి పవర్ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చిన ప్రజలకి ఇప్పటికీ పరిహారం చెల్లించకపోవడం బాధాకరమని అన్నారు.

Also Read:-ఇది సర్దుబాటు కాదు.. 'సర్దుపోటు': పవన్, చంద్రబాబులను కడిగేసిన షర్మిల

 ఇక మాచవరంలో సరస్వతి పవర్ కి  దాదాపుగా 15 వందల ఎకరాలు అటవీ భూములు ఉన్నాయని దీంతో 4 వందల ఎకరాల అటవీ భూములను కూడా అక్రమంగా తీసుకున్నారని అన్నారు. దీంతో సర్వేకి ఆదేశించగా వారం రోజుల క్రితమే అధికారులు సర్వే పూర్తీ చేశారని తెలిపారు.