ఆంధ్ర ప్రదేశ్: తెనాలి మహిళ గీతాంజలి ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే ఆమె కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు.
ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ చట్టం వదిలిపెట్టదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియోపై ప్రతిపక్షాల(టీడీపీ, జనసేన)కు చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ గీతాంజలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.