చంద్రబాబుకు ఓటేస్తే పులి నోట్లో తల పెట్టినట్లేనని ఏపీ సీఎం జగన్ అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సోమవారం ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించారు. వెంకటాచలంపల్లిలో పెన్షన్ లబ్దిదారులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని చెప్పుకొచ్చారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. మేనిఫెస్టోలో కనీసం 10 శాతం హామీలనైనా అమలు చేశారా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు లాగా తనకు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం రాదన్నారు జగన్.. చంద్రబాబు, వారి కూటమిలా నొటికొచ్చిన అబద్ధాలు తాను చెప్పలేను. తాను ఏదైనా చెప్పాడంటే చేసి చూపిస్తానని తెలిపారు.
2019 ఎన్నికలకు ముందే పెన్షన్ వెయ్యి రూపాయలేనని.. దేశంలోనే మొట్టమొదటి సారిగా పెన్షన్ రూ.3వేలకు పెంచామన్నారు సీఎం జగన్. గతంలో 39 లక్షల మందికి పెన్షన్ ఇస్తే.. ఇప్పుడు 66 లక్ష మందికి పెన్షన్ ఇస్తున్నామన్నారు సీఎం జగన్. దేశంలో ఎక్కడ ఇంటికీ ఇచ్చే పెన్షన్ లేదని పేర్కొన్నారు జగన్. ఏటా 24 వేల కోట్లు పెన్షన్ కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం అరకొరగా పెన్షన్ ఇస్తూ ఉంటే దానిని పూర్తిగా మార్పు చేశామన్నారు జగన్. అర్హత ఉంటే చాలు ప్రతీ ఒక్కరికీ పెన్షన్ అందించామని.. కుల, మత, రాజకీయాలకు అతీతంగా పెన్షన్ అందించామని తెలిపారు.
ముఖాముఖి కార్యక్రమం తర్వాత.. సీఎం జగన్ బొదనంపాడు, కురిచేడు, చింతలచెరువు మీదుగా వినుకొండ అడ్డ రోడ్‌కు చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. లంచ్ బ్రేక్ తర్వాత చీకటిగలపాలెం మీదుగా వినుకొండ చేరుకుని… మధ్యాహ్నం 3గంటలకు భారీ రోడ్‌షో నిర్వహిస్తారు. ఆ తర్వాత కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు జగన్.