స్కూల్ పిల్లల వరద సాయం: సీఎం చంద్రబాబు భావోద్వేగం

ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు విజయవాడ(ఏపీ) అతలాకుతలమైన విషయం తెలిసిందే. బుడమేరు వాగుకు వరద నీరు పోటెత్తడంతో పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. దాదాపు వారం రోజుల పాటు ప్రజలు ఆహారం, నీళ్లు లేక అల్లాడిపోయారు. ఇక పసిపిల్లలున్న వారి సంగతి ఆ దేవునికే తెలియాలి. వారి కష్టాలను చూసి చలించిపోయిన ప్రతి ఒక్కరు తోచినంత సహాయం చేశారు. తాజాగా, ఓ పాఠశాల విద్యార్థులు తమకు తోచినంత సహాయం చేసి మంచి మనసు చాటుకున్నారు. 

పశ్చిమగోదావరి జిల్లా, పెంటపాడు మండలం పడమర విప్పర్రులోని శ్రీ విద్యా నికేతన్ పాఠశాల చిన్నారులు వరద బాధితులకు సాయం చేశారు. స్కూలుకు తెచ్చుకున్న తమ పాకెట్ మనీని విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి విరాళంగా ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చిన్నారుల మంచి మనసుకు బాబు చలించిపోయారు. విద్యార్థుల్లో ఇలాంటి విలువలను పెంపొందించిన పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.