గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా సీఎం జగన్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్లీనరీ సమావేశాల్లో తీర్మానం చేసి ఆమోదించారు. ఈ తీర్మానంతో పాటు పారదర్శక పాలన, సామాజిక సాధికారత, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, వ్యవసాయం వంటి అంశాల తీర్మానాలపై చర్చించి ఆమోదించారు. అనంతరం ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం పని చేస్తోన్న నేతలు, కార్యకర్తలను ఆయన కొనియాడారు. పార్టీ ఆవిర్భావ సభలో జన సునామీ కనిపిస్తోందని, 13 ఏడేళ్లుగా పార్టీని కాపాడుకుంటూ వస్తోన్న కార్యకర్తలందరికీ సెల్యూట్ చేస్తున్నానని జగన్ అన్నారు. పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పినవన్నీ వరుసగా అమలు చేసుకుంటూ వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తన దృష్టంతా ప్రజలకు మంచి చేయడంపైనే ఉందన్న జగన్... రాష్ట్రంలోని నిరుపేదల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన తమ ప్రస్థానం... ఇవాళ 151 ఎమ్మెల్యేలతో అధికారంలో కొనసాగే దాకా వచ్చిందని సీఎం జగన్ ఆనందం వ్యక్తం చేశారు.
