ఏపీలో జనవరి నుంచి రచ్చబండ

ఏపీలో జనవరి నుంచి రచ్చబండ

అమరావతి, వెలుగు: జనవరి నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. జిల్లాల్లో పర్యటించి సంక్షేమ పథకాల అమలుపై ప్రజలతో నేరుగా మాట్లాడతానని, వారి నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తానన్నారు. రచ్చబండలో ప్రజల సమస్యల పరిష్కారానికి అక్కడే హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని,  వాటిని రెండు వారాల్లో అమలు చేసేలా అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. శుక్రవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ శాఖల హెచ్ఓడీలతో ఆయన సమావేశమయ్యారు. “నవరత్నాల అమలే ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత. మేనిఫెస్టో ద్వారా ప్రాధాన్యతలేంటో చెప్పాం. ప్రతి అధికారి వద్ద నవరత్నాల కాపీ ఉండాలి. 14 నెలల పాటు 3648 కి.మీ. పాదయాత్ర చేసి మేనిఫెస్టో తయారు చేశాం. అందులో ఒక్క హామీ అమలు చేయకున్నా ప్రభుత్వం ఫెయిల్ అయినట్లే. ఆ పరిస్థితి ఎంత మాత్రం రాకూడదు. నేను ఇచ్చే ప్రతి హామీ వారం రోజుల్లో అమలు చేయాల్సిందే. శంకుస్థాపన చేసిన 4 వారాల్లో నిర్మాణ పనులు మొదలు కావాల్సిందే” అని ఆదేశించారు. టీడీపీ సర్కారు తరహాలో శంకుస్థాపన చేసిన మూడేళ్ల తరువాత పనులు మొదలెడితే కుదరదన్నారు. హెచ్ ఓడీలు శాఖల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సంక్షేమ పథకాల వల్ల ప్రభుత్వంపై వేల కోట్ల భారం పడుతోందన్నారు. అదనంగా ఖర్చయ్యే రూ. 12 వేల కోట్లను సామాన్యులపై భారం మోపకుండా ప్రభుత్వ ఆదాయం ఎలా పెంచుకోవాలో అన్వేషించాలని అధికారులకు సూచించారు. శాఖలవారీగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఢిల్లీలో ఉన్న ఏపీ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. సంక్షేమ పథకాలు, ఎన్ఆర్ఈజీఎస్ కింద కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టాలని చెప్పారు.