స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న చంద్రబాబుకు (Chandrababu) మరో బిగ్ షాక్ ఇచ్చింది ఏపీ సీఐడీ (AP CID). ఆయనపై మరో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులిచ్చారన్న ఆరోపణలతో చంద్రబాబుపై కేసును నమోదైంది. పీసీ యాక్ట్ కింద ఈ కేసును సీఐడీ అధికారులు నమోదు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చే విషయంలో 1300 కోట్ల రూపాయిలు ప్రజాధనం దుర్వినియోగం అయిందని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును సీఐడీ ఏ3గా చేర్చింది. చంద్రబాబుపై కేసు నమోదు చేసిన అంశాన్ని ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరపాలని పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్ ను ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ కేసులో A1 గా నరేష్, A2 గా మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు.
ఇప్పటికే పలు కేసుల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుపై.... ఏపీ సీఐడీ ఆయనపై మరో కేసు ఫైల్ చేసింది. ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబుకి సంబంధించిన వేర్వేరు కేసులపై విచారణ జరుగుతోంది. కొన్ని కేసుల్లో తీర్పులు రిజర్వ్ లో ఉన్నాయి. కొన్ని కేసుల్లో విచారణ వాయిదా పడింది. స్కిల్ స్కామ్ కేసు, అంగళ్లు అల్లర్ల కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పుని రిజర్వ్ చేశారు. మరోవైపు ముందస్తు బెయిల్ పై తీర్పు రావాల్సి ఉంది.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసింది సీఐడీ. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని, ఆ సమయంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని, కావాల్సిన కంపెనీలకు అనుమతులు ఇచ్చారని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సి ఉందంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. ఈ కేసులో చంద్రబాబుని ఏ3గా చేర్చింది. దీనిపై విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. రేపు(అక్టోబర్ 31) ఈ కేసుపై విచారణ జరిగే అవకాశం ఉంది.