ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం

అమరావతి: ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం (నవంబర్ 20) సాయంత్రం భేటీ అయిన మంత్రి మండలి.. దాదాపు మూడు గంటల పాటు వివిధ అంశాలపై సుదీర్ఘంగా డిస్కస్ చేసి పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ఏపీలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు, లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ALSO READ | చంద్రబాబు.. తల్లిదండ్రులకు ఏనాడైనా రెండు పూటలా భోజనం పెట్టావా: జగన్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల కట్టడి కోసం ఈగల్‌ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటుకు మంత్రి వర్గం ఒకే చెప్పింది. నూతన స్పోర్ట్స్‌, పర్యాటక పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, అమరావతి సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు, కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్స్‌ల పునరుద్ధరణకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ టవర్ కార్పొరేషన్‌ ఫైబర్‌గ్రిడ్‌లో విలీనం చేయాలని నిర్ణయించడంతో పాటు దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టసవరణ బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.