ఏపీలో ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి జూద క్రీడలపై నిషేధం

ఏపీలో ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి జూద క్రీడలపై నిషేధం

రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి జూద క్రీడలపై నిషేధం విధిస్తూ ఏపీ మంత్రి వ‌ర్గం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

మంత్రి వ‌ర్గం స‌మావేశంలో జూద క్రీడ‌ల‌పై నిర్వాహకులు మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు, రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు, జరిమానా, ఆన్‌ లైన్‌ జూదం ఆడుతూ పట్టుబడితే ఆరునెలల జైలు శిక్ష విధించేలా నిర్ణ‌యం తీసుకుంది.

వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. డిసెంబర్‌ 1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకం అమ‌ల‌వుతుండ‌గా.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకం అమలు చేసేలా మంత్రి వ‌ర్గం తీర్మానించింది.

రాష్ట్రంలో ఫీడర్ల అప్‌గ్రేడేషన్‌కు రూ.1700 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పాటు రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ..లక్ష అనధికార ఉచిత విద్యుత్‌ కనెక్షన్ల క్రమబద్ధీకరణ, భూమిని కౌలుకిచ్చిన రైతులకూ ఉచిత విద్యుత్‌ పథకం, విద్యుత్‌ బకాయిల చెల్లింపు బాధ్యత ,రాష్ట్రంలో ఎండీవోలకు డీడీవోలుగా ప్రమోషన్ , రాష్ట్రంలో స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఏర్పాటు, ప్రకాశం బ్యారేజీ దిగువన 3 టీఎంసీల సామర్ధ్యంతో మరో రెండు బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

రూ.1350 కోట్ల ఖర్చుతో కృష్ణానదిపై చోడవరం వద్ద బ్యారేజీ నిర్మాణం, రూ. 1280 కోట్లతో మోపిదేవి వద్ద కృష్ణానదిపై మరో బ్యారేజీ నిర్మాణం, రూ.15380 కోట్లతో ఉత్తరాంధ్రలోని మెట్టప్రాంతాల కోసం బాబూజగజ్జీవన్ రామ్‌ సుజల స్రవంతి పథకం, బాబూజగజ్జీవన్ రామ్‌ సుజల స్రవంతి పథకంతో 8 లక్షల ఎకరాలకు లబ్ది, రాయలసీమ కరువు నివారణ పథకం కింద 14 పనులకు త్వరిత గతిన పూర్తి చేయాలని కేబినేట్ నిర్ణయించింది.

వీటితో పాటు బాపట్ల, మార్కాపురంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం స్ధల కేటాయింపు , మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడిగింపు, పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలుపుతూ నిర్ణ‌యం తీసుకుంది.