నకిలీ బ్రాండ్ లిక్కర్ తో దోపిడీ

నకిలీ బ్రాండ్ లిక్కర్ తో దోపిడీ

రాష్ట్రంలో జగన్ సర్కారు చేస్తున్న దోపిడీ, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని అన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈ ఎన్నికల్లో జనసేనతో కలిసి పొత్తు పెట్టుకుని పోటీకి వెళ్తున్నట్లు చెప్పారు. గెలుపే లక్ష్యంగా కార్యకర్తలంతా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నకిలీ బ్రాండ్ లతో లిక్కర్ పై భారీగా దోపిడీ జరుగుతోందన్నారు. అధికారపక్ష నేతలు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుపుతున్నారని ఆరోపించారు. వైసీపీ కరెంటు చార్జీలు పెంచబోమని మాయమాటలు చెప్పి.. అధికారంలోకి రాగానే భారీగా పెంచేసిదని అన్నారు. పెట్రోల్ రేటు కూడా దేశంలోనే ఏపీలో ఎక్కవగా ఉందన్నారు కన్నా. వైసీపీ అధికారంలోకి వచ్చాక తొమ్మిది నెలల పాలనలో ప్రజలపై విపరీతంగా భారం మోపారని, దీనిని ప్రచార అస్త్రంగా వాడుకుని స్థానిక ఎన్నికల పోరులో విజయం సాధించాలని అన్నారు. ఈ ఎలక్షన్లపై మహిళా మోర్చా అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, నాయకులు, కార్యకర్తలు అంతా కలిసి పని చేయాలని చెప్పారు.

చాక్లెట్ ఇచ్చి నెక్లస్ దోపిడీ

జగన్ పాలనపై ఆయనకే నమ్మకం లేదని, నవరత్నాల పేరుతో చాక్లెట్ ఇచ్చి నెక్లస్ దోచుకెళ్తున్నారని ఆరోపించారు కన్నా. రాజధాని సహా ప్రభుత్వం తీసుకున్న అన్ని ప్రజా వ్యతిరేక విధానాలను ప్రచారంలో వివరించాలన్నారు. రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయన్నారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి అంతా కేంద్రం ఇచ్చిన నిధుల వల్లే జరుగుతోందని, ఓటు అడిగే హక్కు బీజేపీకి మాత్రమే ఉందని చెప్పారు. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉందని, అందరూ కష్టపడి పనిచేయాలని అన్నారు కన్నా. భయబ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని, దీనికి ఎవరూ లొంగవద్దని సూచించారు కన్నా లక్ష్మీ నారాయణ.