కేబినెట్ సమావేశంలో నిర్ణయం
వైఎస్ఆర్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం
ఆగస్టు 12న వైఎస్ఆర్ చేయూత పథకం ప్రారంభం
విజయవాడ: ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 16 నుంచి నిర్వహించాలని కేబినెట్ సమావేశం తీర్మానించింది. గురువారం ఉదయం తాడేపల్లిలోనీ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాలతోపాటు.. పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి తీర్మానాలను ఆమోదించారు. వైఎస్ఆర్ చేయూత పేరుతో 45 ఏళ్ల నుండి 60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏడాదికి రూ.18 వేల 142 చొప్పున నాలుగేళ్లలో 75వేల వరకు ఆర్ధిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే ఆగస్టు 12న వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించాలని తీర్మానం చేశారు. అలాగే రామాయపట్నం పోర్టుకు కేంద్ర నిధులపై కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. రాష్ర్ట విభజన హామీల్లో భాగంగా రమాయపట్నం పోర్టుకి కేంద్రం నిధులివ్వాల్సి ఉందని.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఓ వైపు ప్రయత్నిస్తూనే.. ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు నిర్మాణం జరిపే విధంగా నిర్ణయం తీసుకున్నారు. మొదటి దశలో రూ. 4736 కోట్ల తో రామాయట్నం మొదటి దశ నిర్మాణం చేపట్టాలని.. ఆగస్టులోగా టెండర్లు పిలవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రామాయట్నం టెండర్లను ఖరారు చేసే ముందు జ్యుడీషియల్ రివ్యూకు పంపాలని జగన్ సూచించారు. అలాగే కొత్తగా 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. ట్రాన్స్ కో, డిస్కమ్ లకు 6 వేల కోట్ల నిధుల ఖర్చుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

