కృష్ణా నీళ్ల మళ్లింపులో ఏపీ దూకుడు

కృష్ణా నీళ్ల మళ్లింపులో ఏపీ దూకుడు
గాలేరు-నగరితో హంద్రీ-నీవా లింక్ గాలేరు-నగరి కాలువ కెపాసిటీ పెంపు రూ.6,348 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం మూడేండ్లలో పనులు పూర్తి చేయాలని టార్గెట్ హైదరాబాద్‌, వెలుగు: పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, సంగమేశ్వరం లిఫ్ట్‌ స్కీం ద్వారా కృష్ణానది నీళ్లను మళ్లించుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు వేగంగా చేపడుతోంది. రాయలసీమకు నీళ్లను తీసుకుపోయే ఈ పనుల్లో నిమగ్నమైంది. పెన్నా బేసిన్‌ మొత్తానికి శ్రీశైలం నీటిని మళ్లించే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే రాయలసీమ లిఫ్ట్‌ స్కీం పనులను మొదలు పెట్టిన ఏపీ సర్కారు.. గాలేరు నగరితో హంద్రీనీవాను లింక్ చేయడంతోపాటు గాలేరు నగరి వరద కాలువ కెపాసిటీని ఇంకో టీఎంసీ పెంచే పనులకు టెండర్లు పిలిచింది. రూ. 6,348 కోట్లతో మూడేండ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. రూ.1,974 కోట్లతో జీఎన్‌ఎస్‌ఎస్‌ వరద కాలువ విస్తరణ గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) వరద కాలువ కెపాసిటీని 20 వేల క్యూసెక్కుల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు కొత్తగా రిజర్వాయర్‌ నిర్మాణ పనులకు రూ.1,974.34 కోట్లతో టెండర్‌ పిలిచింది. అవుకు రిజర్వాయర్‌‌ నుంచి గండికోట రిజర్వాయర్‌‌ వరకు 52.18 కి.మీ. వరద కాలువ సామర్థ్యాన్ని 20 వేల క్యూసెక్కుల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచనున్నారు. అవుకు రిజర్వాయర్‌‌పై హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ నిర్మిస్తారు. దాని ద్వారా గండికోట రిజర్వాయర్‌‌కు ఇంకో 10 వేల క్యూస్కెకుల నీటిని తరలించేలా కొత్త టన్నెల్‌‌కు నీళ్లు మళ్లిస్తారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం లింగాపురం తండా వద్ద 10 వేల క్యూస్కెకులతో అదనపు టన్నెల్‌‌ తవ్వకం చేపట్టనున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్‌‌ రిజర్వాయర్‌‌ నుంచి ఎర్రబెల్లి చెరువుకు నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి కొత్తగా నిర్మించే గిడ్డంగివారిపల్లి రిజర్వాయర్‌‌కు నీళ్లు తరలిస్తారు. పులివెందుల, వేముల మండలాల్లోని 10 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు 1.20 టీఎంసీ సామర్థ్యంతో గిడ్డంగివారిపల్లి రిజర్వాయర్‌‌ ను నిర్మిస్తున్నారు. కడప జిల్లాలోని పర్నపల్లి, ఎర్రబెల్లి వద్ద రెండు స్టేజీల్లో నీటిని ఎత్తిపోయడానికి పంపుహౌస్‌‌లు నిర్మిస్తారు. ఫస్ట్‌‌ పంపుహౌస్‌‌ ద్వారా 70 రోజుల పాటు 350 క్యూసెక్కులు, రెండో పంపుహౌస్‌‌ ద్వారా 300 క్యూసెక్కుల చొప్పున నీటిని ఎత్తిపోస్తారు. రూ. 4,373 కోట్లతో లింక్‌‌ ప్రాజెక్టు గాలేరు – నగరి సుజల స్రవంతితో హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్​ఎన్​ఎస్​ఎస్​) ప్రాజెక్టును అనుసంధానం చేసే పనులకు రూ.4,373.93 కోట్లతో టెండర్లు పిలిచారు. ఈ లింక్‌‌ ప్రాజెక్టులో భాగంగా 7 స్టేజీల్లో కృష్ణా నీళ్లను ఎత్తిపోయనున్నారు. కడప జిల్లా వేంపల్లి మండలం పాములూరు గాలేరు నగరి సుజల స్రవంతి కాలువ 56 కి.మీ. వద్ద క్రాస్‌‌ రెగ్యులేటర్‌‌ నిర్మించి అక్కడి నుంచి సమీపంలో నిర్మించే సర్జ్‌‌పూల్‌‌కు నీటిని తరలిస్తారు. పాములూరు వద్ద మొదటి పంపుహౌస్‌‌ను నిర్మిస్తారు. అక్కడి నుంచి టన్నెల్‌‌, గ్రావిటీ కాలువ ద్వారా 19.97 కి.మీ. దూరంలో తక్కళ్లపల్లి సమీపంలోని కాలేటివాగు రిజర్వాయర్‌‌కు తరలిస్తారు. అక్కడి పంపుహౌస్‌‌ ద్వారా 6.59 కి.మీ.లు నీటిని తరలించి కల్లూరుపల్లిలో కొత్తగా నిర్మించే చెరువులో పోస్తారు. అక్కడి పంపుహౌస్‌‌ ద్వారా 14.64  కి.మీ. దూరంలోని వెలివాగు డ్యాంకు నీటిని తరలిస్తారు. వెలివాగు డ్యాం ఫోర్‌‌షోర్‌‌లో మరో పంపుహౌస్‌‌ ఏర్పాటు చేసి 15.02 కి.మీ. దూరంలోని చిత్తూరు జిల్లాలోని పెద్దూరు రిజర్వాయర్‌‌కు నీటిని తరలిస్తారు. అక్కడి పంపుహౌస్‌‌ ద్వారా 6.16 కి.మీ. నీటిని తరలించి చిత్తూరు జిల్లాలోని నాయునిచెరువు గ్రామంలోని చెరువులో పోస్తారు. అక్కడ నిర్మించే పంపుహౌస్‌‌ ద్వారా చిత్తూరు జిల్లాలో 13.80 కి.మీ. దూరం వరకు నీటిని తరలిస్తారు. గాలేరు నగరితోపాటు హంద్రీనీవా సుజల స్రవంతి  పూర్తి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేలా ఈ పనులు ప్రతిపాదించారు. జనవరి 11న టెండర్‌‌ అవార్డ్‌‌ జీఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌, హెచ్‌‌ఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌ అనుసంధానం, జీఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌ వరద కాలువ సామర్థ్యం పెంపు పనులకు ఈ నెల 19న టెండర్లు పిలిచారు. బిడ్లు దాఖలు చేయడానికి జనవరి రెండో తేదీ వరకు అవకాశముంది. ఈ నెల 26న కడప జిల్లా ప్రాజెక్ట్స్‌‌ సీఈ ఆఫీస్‌‌లో ప్రీ బిడ్‌‌ మీటింగ్‌‌ నిర్వహిస్తారు. జనవరి 11న ఉదయం 11 గంటలకు ప్రైస్‌‌ బిడ్లను ఓపెన్‌‌ చేసి ఎల్‌‌-1గా నిలిచిన వర్క్‌‌ ఏజెన్సీ కోట్‌‌ చేసిన ప్రైస్‌‌తో రివర్స్‌‌ టెండరింగ్‌‌ (ఈ – ఆక్షన్‌‌) బిడ్లు స్వీకరిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఈ–ఆక్షన్‌‌ బిడ్‌‌ను ఓపెన్‌‌ చేసి, అందరికన్నా తక్కువకు కోట్‌‌ చేసిన వర్క్‌‌ ఏజెన్సీకి పనులు అప్పగిస్తారు.