విత్తన చట్టంలో మార్పులు అవసరం

  • ప్రైవేట్​ కంపెనీ విత్తన డీలర్లకు చెక్​ పెట్టాలి
  • రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్​ అన్వేష్​ రెడ్డి 

మెదక్​, వెలుగు: ప్రస్తుతం ఉన్న విత్తన చట్టం ప్రైవేట్​ కంపెనీలకు అనుకూలంగా ఉన్నందున ఆ చట్టంలో మార్పు అవసరమని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్​ అన్వేష్​ ​రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ కలెక్టరేట్​లో ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యవసాయ, సహకార  శాఖ అధికారులు, పీఏసీఎస్​ చైర్మెన్​లు, సీఈఓలు, రైతు ఆగ్రో సేవా కేంద్రాల డీలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండగా విత్తన చట్టం కేంద్రం పరిధిలో ఉందన్నారు. ఈ చట్టం రైతులకు అనుకూలంగా ఉండాలన్నారు.

అలా లేకపోవడం వల్ల పంట నష్టం జరిగిన సందర్భాల్లో బాధిత రైతులకు పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.  నష్ట పోయిన రైతులు న్యాయం కోసం కోర్టులకు వెళ్లాల్సి రావడం వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్నారన్నారు. అందువల్ల విత్తన చట్టంలో మార్పు అవశ్యమని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

 రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సకాలంలో న్యాయమైన విత్తనాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని  చెప్పారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి విత్తనాలపై సబ్సిడీ ఇస్తామన్నారు.  కార్యక్రమంలో మెదక్, వెల్దుర్తి పీఏసీఎస్​ చైర్మెన్​ లు హన్మంతరెడ్డి, అనంతరెడ్డి, డీఏఓ గోవింద్, డీసీఓ కరుణ తదితరులు పాల్గొన్నారు.