Delhi Premier League: గిల్‌క్రిస్ట్‌‌తో పోల్చినందుకు సంతోషంగా ఉంది: RCB యువ క్రికెటర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ అనుజ్ రావత్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో దంచి కొడుతున్నాడు. ఈస్ట్ ఢిల్లీ జట్టు తరపున ఆడుతున్న రావత్.. ఓల్డ్ ఢిల్లీపై మెరుపు సెంచరీ చేశాడు. 66 బంతుల్లోనే 6 ఫోర్లు, 11 సిక్సర్లతో 121 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. రావత్ ఆడిన ఈ ఇన్నింగ్స్ పై ప్రశంసలు వర్షం కురుస్తుంది. ఇతడిని ఏకంగా ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ తో పోలుస్తున్నారు. ఈ పోలికపై రావత్ తాజాగా స్పందించాడు. 

ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ తో తనను పోల్చడం గౌరవంగా భావిస్తున్నానని రావత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. "నేను గిల్‌క్రిస్ట్‌ కు పెద్ద అభిమానిని. అభిమానులు నన్ను గుర్గావ్‌కి చెందిన గిల్‌క్రిస్ట్ అని పిలుస్తారు. ఇది నాకు గౌరవం". అని రావత్ అన్నాడు. ఆస్ట్రేలియా తరపున వికెట్ కీపర్ బ్యాటర్ గిల్‌క్రిస్ట్‌ తనదైన ముద్ర వేశాడు. ఓపెనర్ గా వచ్చి విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడడంతో పాటు.. వికెట్ కీపింగ్ లో అత్యున్నత ప్రదర్శన ఇచ్చేవాడు. 

ALSO READ | ENG vs SL 2024: రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు.. లారా, గవాస్కర్ సరసన రూట్

ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో అదరగొడుతున్న అనుజ్ రావత్ ఐపీఎల్ ద్వారానే ప్రపంచానికి తెలిశాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కొన్ని కీలక ఇన్నింగ్స్ లు ఆడి అందరి దృష్టిలో పడ్డాడు. 2024 ఐపీఎల్ సీజన్ లో 5 మ్యాచ్‌లలో కేవలం 98 పరుగులు చేసి నిరాశ పరిచాడు. ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ తరపున ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అతన్ని 2024 ఐపీఎల్ మెగా ఆక్షన్ లోకి అవకాశముంది.