Ranji Trophy 2024-25: 39 ఏళ్ళ తర్వాత మరోసారి: ప్రత్యర్థి జట్టుని అలౌట్ చేసిన ఒకే ఒక్కడు

రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో అద్భుతాలు జరుగుతున్నాయి. నిన్న ఒకే మ్యాచ్ లో ఇద్దరు ఆటగాళ్లు ట్రిపుల్ సెంచరీ కొట్టి రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జంటగా గోవా బ్యాటర్లు స్నేహల్ కౌతంకర్,కశ్యప్ బక్లే నిలిచారు. నేడు (నవంబర్ 15) హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్ చరిత్ర సృష్టించాడు. కేరళపై ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లను  పడగొట్టాడు. శుక్రవారం మూడో రోజు ఆటలో భాగంగా అతను ఈ ఘనతను అందుకున్నాడు. కాంబోజ్ చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్ లో కేరళ 291 పరుగులకు ఆలౌటైంది.    

రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు పడగొట్టిన అతను మూడో రోజు మిగిలిన రెండు వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా 49 పరుగులు మాత్రమే ఇచ్చి అతను 10 వికెట్లు తీసుకున్నాడు. కాంబోజ్ 10 వికెట్లు తీసిన వీడియోను బీసీసీఐ షేర్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ హర్యానా ఫాస్ట్ బౌలర్ ఇప్పటివరకు తన కెరీర్‌లో 19 మ్యాచ్‌ల్లో 24.14 సగటుతో 57 వికెట్లు పడగొట్టగా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతనికి ఇది మొదటి పది వికెట్ల ప్రదర్శన. 

ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ టోర్నీలో ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా కాంబోజ్ నిలిచాడు. ఛటర్జీ 1957లో అస్సాంపై  తొలి సారి ఈ ఫీట్ సాధించగా.. 1985లో సుందరం విదర్భపై ఈ ఘనత అందుకున్నాడు. మళ్ళీ 39 ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీలో కాంబోజ్ ఈ 10 వికెట్ల ఘనతను అందుకోవడం విశేషం. వీరితో పాటు సుభాష్ గుప్తే (1954-55), అనిల్ కుంబ్లే (1999), దేబాసిస్ మొహంతి 2000-01 కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 10 వికెట్ల ఘనత అందుకున్నారు.