ఏపీలో పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు తీవ్ర కలకలం రేపాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో పిన్నెల్లికి కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా, తాజాగా ఆయనపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. పిన్నెల్లి బ్రదర్స్ నుండి తనకు ప్రాణహాని ఉందంటూ టీడీపీ కార్యకర్త నోముల మాణిక్యాలరావు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను మాచర్ల వెళ్లే పరిస్థితి లేదని, తనకు రక్షణ కల్పించాలని కోరారు మాణిక్యాలరావు.
అయితే, మొదట మాణిక్యాలరావు ఫిర్యాదును మంగళగిరి పోలీసులు స్వీకరించలేదు. దీంతో ఆయన టీడీపీ నేత డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు వినతిపత్రం అందచేయటంతో ఎట్టకేలకు మంగళగిరి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కొత్త కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పిన్నెల్లి. ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.