2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకీ రెట్టింపవుతోంది. ఈ ఎన్నికల్లో ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాత్రం ఈ ఎన్నికలు కీలకం అని చెప్పాలి. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఈసారి పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని అధికార వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే వంగా గీతకే టికెట్ కేటాయించింది.
అంతే కాకుండా, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఎంపీ మిధున్ రెడ్డి వంటి కీలక నేతలకు పిఠాపురం బయటలు అప్పగించారు జగన్. నియోజకవర్గంలో వంగా గీతకు బలమైన ఓట్ బ్యాంక్ ఉండటం, స్థానిక టీడీపీ నేత వర్మ వర్గం నుండి ఆశించిన రేంజ్ లో సపోర్ట్ అందకపోవటం పవన్ కి ఒక తలనొప్పిగా మారితే, తాజాగా మరో తల నొప్పి వచ్చి పడింది. పిఠాపురం బరిలో మరో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. నవరంగ్ కాంగ్రెస్ తరఫున కనుమూరి పవన్ కళ్యాణ్ అనే అభ్యర్థి పోటీ చేస్తున్నారు. దీనికి తోడు ఆ పార్టీ గుర్తు బకెట్ గాజు గ్లాసుకి దగ్గరగా ఉండటం జనసైనికులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇదంతా జగన్ స్కెచ్ అంటున్నారు జనసైనికులు.