బిజినెస్ డెస్క్, వెలుగు: క్రిప్టో ఇండస్ట్రీలో మరో మోసం బయటపడింది. మోరిస్ కాయిన్ పేరుతో ఓ ఫేక్ క్రిప్టోకరెన్సీని క్రియేట్ చేసి ఇన్వెస్టర్ల నుంచి రూ. 1,200 కోట్లను దండుకున్నాడు కేరళకు చెందిన నిషాద్ కే (31). కేవలం రూ. 15 వేలు ఇన్వెస్ట్ చేస్తే 300 రోజుల పాటు రోజుకి 3 శాతం రిటర్న్ ఇవ్వడంతో పాటు రూ. 1,500 విలువైన15 మోరిస్ కాయిన్లను ఇస్తామని నిషాద్ ప్రచారం చేశాడు. మోరిస్ కాయిన్ అనే ఒక ఫేక్ కాయిన్ క్రియేట్ చేసి, ఇనీషియల్ కాయిన్ ఆఫర్ (ఐసీఓ) కి వస్తున్నామని, తక్కువ రేటుకే ఈ క్రిప్టోను ఇన్వెస్టర్లు కొనుక్కోవాలని సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేశాడు. కొత్త కాయిన్లను క్రియేట్ చేయడానికి, యాప్ లేదా సర్వీస్ స్టార్ట్ చేయడానికి కంపెనీలు మార్కెట్‌లో ఐపీఓ మాదిరే ఐసీఓకి ద్వారా ఫండ్స్‌ను సేకరిస్తాయి. ఫ్రాంక్ ఎక్స్చేంజ్ అనే ఫేక్ ఎక్స్చేంజిని క్రియేట్ చేసి, ఈ ఎక్స్చేంజిలో మోరిస్ కాయిన్లను లిస్ట్ చేస్తామని ప్రచారం చేశాడు. నిషాద్ తల్లిదండ్రులు ఈ కాయిన్ ప్రచారం చేయడంలో భాగం పంచుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మోరిస్ కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయించే ఏజెంట్లకు 10–30 % కమీషన్‌ను కూడా నిషాద్ ఇచ్చేవాడు.
ప్రమోషన్లలో సెలబ్రెటీలు..
ఈ క్రిప్టో స్కామ్‌ను చాలా జాగ్రత్తగా నిషాద్ చేశాడు. సెలబ్రెటీల సమక్షంలో వివిధ ప్రమోటింగ్ ఈవెంట్లను నిర్వహించాడు. వివిధ వెబ్‌సైట్లను ఇన్వెస్టర్లకు పరిచయం చేయడంతో పాటు యూట్యూబ్ ద్వారా మోరిస్ కాయిన్‌లో ఎంత ఉంటే అంత ఇన్వెస్ట్ చేయాలని, వెంటనే ఇన్వెస్ట్ చేయాలని ప్రచారం చేశాడు. కొయంబత్తూర్ చెందిన ఫ్రాంక్ ఎక్స్చేంజి (ఫేక్) లో మోరిస్ కాయిన్లు లిస్ట్ అవుతాయని, ఈ కాయిన్లు తర్వాత భారీగా పెరుగుతాయని ఇన్వెస్టర్లను నమ్మించాడు. కానీ, మోరిస్ కాయిన్లు ఎక్కడా లిస్ట్ కాలేదు. కాగా, ఇన్వెస్టర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో నిషాద్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన ఆస్తులను, ఫండ్స్‌ను అటాచ్ చేసింది.
