తెలంగాణ-చత్తీస్‌‌గఢ్‌‌ బార్డర్‌‌లో మరో బేస్‌‌ క్యాంప్‌‌

భద్రాచలం, వెలుగు : మావోయిస్టుల ఏరివేతలో భాగంగా భద్రతాబలగాలు మరో బేస్‌‌ క్యాంప్‌‌ ఏర్పాటు చేశాయి. తెలంగాణ–చత్తీస్‌‌గఢ్‌‌ బార్డర్‌‌లోని సుక్మా జిల్లా మెట్టగూడెం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్యాంప్‌‌ను సుక్మా ఎస్పీ కిరణ్‌‌ చౌహాన్‌‌ సీఆర్‌‌పీఎఫ్‌‌, డీఆర్‌‌జీ బలగాలతో కలిసి బుధవారం ప్రారంభించారు. క్యాంప్‌‌ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు కొంతకాలంగా దాడులకు పాల్పడుతున్నారు. దీంతో మావోయిస్ట్‌‌ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, మిలటరీ చీఫ్‌‌ దేవాల ఇలాఖా అయిన పువ్వర్తి, మెట్టగూడెం అడవులను భద్రతాబలగాలు మూడు రోజుల పాటు జల్లెడ పట్టాయి. హిడ్మా, దేవాలు తెలంగాణ, చత్తీస్‌‌గఢ్‌‌ బార్డర్‌‌లో తలదాచుకొని, దళాల క్యాంప్‌‌లపై దాడులకు స్కెచ్‌‌ వేస్తున్నారన్న అనుమానంతో కేంద్ర హోంశాఖ, రెండు రాష్ట్రాల పోలీసులు జాయింట్‌‌ ఆపరేషన్‌‌ చేపట్టారు. ఇందులో భాగంగా మెట్టగూడెం క్యాంప్‌‌ను ప్రారంభించడంతో కూంబింగ్‌‌ ఆపరేషన్లలో మరింత వేగం పెరగనున్నట్లు తెలుస్తోంది.

పది మందుపాతరలు  నిర్వీర్యం

 కూంబింగ్‌‌కు వచ్చే భద్రతాబలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలను బాంబ్‌‌ స్క్వాడ్‌‌ నిర్వీర్యం చేసింది. చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌ జిల్లా బాసగూడ పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలోని తిమ్మాపూర్‌‌ – పగదండి మార్గంలో మావోయిస్టులు 8 చోట్ల మందుపాతరలు ఏర్పాటు చేశారు. ఇన్‌‌ఫార్మర్ల ద్వారా విషయం తెలుసుకున్న బీజాపూర్‌‌ పోలీసులు బాంబ్‌‌ స్క్వాడ్‌‌కు సమాచారం ఇచ్చారు. వారు తనిఖీలు చేపట్టి 8 మందుపాతరలను గుర్తించి నిర్వీర్యం చేశారు. అలాగే తుర్రం పోలీస్‌‌స్టేషన్‌‌ సమీపంలోని కొండపల్లి, చుట్‌‌వాయి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మరో రెండు మందు పాతరలు సైతం నిర్వీర్యం చేశారు.