ఒకప్పుడు ప్రపంచ వజ్రాల రాజధానిగా వెలుగొందిన సూరత్ నగరం చుట్టూ..ఇప్పుడు భయంకరమైన నీలినీడలు కమ్ముకున్నాయి. సూరత్ లో వజ్రాల వ్యాపారం ఎదుర్కొంటున్న మాంద్యంతో ఎందరో డైమండ్ ఆర్టిజన్లు ఆత్మహత్య లు చేసుకున్నారు. చేసుకుంటున్నారు. తాజాగా మెహుల్ బాబుభాయ్ చౌహాన్(41) ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం (ఫిబ్రవరి 4) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటనతో డైమండ్ పరిశ్రమలో చాలాకాలంగా ఉన్న మాంద్యంతో పెరిగిపోతున్న ఆత్మహత్యల లిస్టులో మరో పేరు చేరింది.
మెహుల్.. అడాజన్ లోని ఠాకోర్ ద్వార్ సొసైటీలో భార్య, ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నారు. మెహుల్ పండోల్ డైమండ్ ఫ్యాక్టరీలో డైమండ్ ఆర్టిజన్(కళాకారుడు)గా పనిచేస్తూ నెలకు 30వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. అయితే ఆర్థిక మాంద్యం అతని సంపాదన పై తీవ్ర ప్రభావం చూపింది. మాంద్యం కారణంగా అతనికి వచ్చే ఆదాయంలో సగం కూడా సంపాదించలేకపోయాడు.
దీంతో మెహుల్ పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేకపోయాడు. తన కుటుంబ అవసరాలను తీర్చేందుకు భారీగా అప్పులు చేయాల్సి వచ్చింది. చివరికి నిరాశకు లోనైన మెహుల్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో 10వ తరగతి చదువుతున్న కూతురు, కుమారుడు, భార్య వీధిన పడ్డారు.
ఈ సంఘటన డైమండ్ పరిశ్రమలో మాంద్యం తీవ్రత..ఆ పరిశ్రమపై ఆధారపడి ఉన్న ఎందరో కార్మికులు దయనీయ, దుర్భర స్థితిని గుర్తు చేస్తుంది. ఒకప్పుడు వజ్రాల వ్యాపారంతో వెలుగు వెలిగిన సూరత్ సిటీ .. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వజ్రాల కార్మికులు ఆత్మహత్యలకు సాక్ష్యంగా ఉంది.
వజ్రాల కార్మికులపట్ల గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని డైమండ్ వర్కర్స్ యూనియన్ గుజరాత్(DWUG) ఆరోపించింది. ఇటీవలీ బడ్జెట్ లో వజ్రాల కార్మికులను ఆదుకునేందుకు ఎలాంటి కేటాయింపులు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
వజ్రాల పరిశ్రమలో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, కార్మికులను కష్టాల నుంచి బయటపడేసేందుకు తక్షణ చర్యలు అవసరం.. డైమండ్ ఆర్టిజన్లకు చేయూత నందించడం, ఆర్థిక సాయం అందించడం, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను చూపించాలని’’ డైమండ్ వర్కర్స్ యూనియన్ గుజరాత్(DWUG) ఉపాధ్యక్షుడు భవేష్ డిమాండ్ చేశారు.
