- ఆమోదం తెలిపిన స్పీకర్ ఓం బిర్లా.. చర్చకు తేదీని నిర్ణయిస్తమని ప్రకటన
- బీఆర్ఎస్ నుంచీ అవిశ్వాసానికి నోటీసులు.. కాపీపై ఎంపీ ఒవైసీ సంతకం
- వ్యతిరేకించిన వైసీపీ.. ఎన్డీఏకు ఫుల్ మెజారిటీ.. వీగిపోనున్న తీర్మానం
- మణిపూర్ అంశంపై చర్చించేందుకే తీర్మానం పెట్టామన్న ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ, వెలుగు: మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ లో ప్రకటన చేయాలంటూ పట్టుబడుతూ వస్తున్న ప్రతిపక్షాలు బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష పార్టీల ఇండియా’ కూటమి తరఫున కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగొయ్ బుధవారం ఈ నోటీసులను అందజేశారు. ఇందుకు స్పీకర్ ఆమోదం తెలిపారు. తీర్మానంపై చర్చకు తేదీని తర్వాత నిర్ణయిస్తామని ఆయన ప్రకటించారు. బీఆర్ఎస్ కూడా కేంద్రంపై విడిగా అవిశ్వాస తీర్మానానికి నోటీసులు అందజేసింది. ఈ తీర్మానం కాపీపై ఎంఐఎం తరఫున మద్దతు తెలియజేస్తూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంతకం చేశారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్ సీపీ వ్యతిరేకించింది. ఎన్డీఏకు బయటి నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. లోక్ సభలోని ఏ సభ్యుడైనా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసులు అందజేయవచ్చు. ఇందుకు కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉంటేనే ఆ నోటీసులను స్పీకర్ ఆమోదిస్తారు. అయితే, బీఆర్ఎస్ తరఫున అందజేసిన నోటీసులపై ఆ పార్టీ ఎంపీలు ముగ్గురితోపాటు అసదుద్దీన్ మాత్రమే సంతకం చేశారు. కాగా, పార్లమెంట్ ఉభయసభల్లో బుధవారం కూడా ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి.
రాజ్యసభలో మంగళవారం తన మైక్‌ను కట్ చేసి అవమానించారంటూ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. అయితే, మైక్ కట్ చేయలేదని, ఖర్గే వేరే అంశంపై మాట్లాడటంతో డిప్యూటీ చైర్మన్ జోక్యం మాత్రమే చేసుకున్నారని చైర్మన్ జగదీప్ ధన్ ఖఢ్ స్పష్టం చేశారు. అనంతరం రాజ్యసభ నుంచి ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. లోక్ సభలో మాత్రం ప్రతిపక్షాల నిరసనల మధ్యే అటవీ సంరక్షణ చట్టం సవరణ బిల్లు పాస్ అయింది.
మణిపూర్‌పై చర్చకోసమే ప్లాన్
లోక్ సభలో ఎన్డీఏకు ఫుల్ మెజారిటీ ఉన్నందున ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోనుంది. ప్రస్తుతం ఎన్డీఏకు లోక్ సభలో 330 మంది ఎంపీల బలం ఉంది. అవసరమైతే స్పీకర్ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలకు 142 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. మరో 71 మంది ఎంపీలు ఈ రెండింట్లో ఏ కూటమిలోనూ లేరు. దీంతో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయం. ఈ విషయం తెలిసినా.. మణిపూర్, ఇతర అంశాలపై సభలో చర్చించాలన్న స్ట్రాటజీలో భాగంగానే ప్రతిపక్షాలు ఈ అస్త్రాన్ని ఎంచుకున్నట్లు చెప్తున్నాయి. మోదీ సర్కారుపై 2018లోనూ అప్పటి యూపీఏ కూటమి దాదాపు ఇదే స్ట్రాటజీతో అవిశ్వాస తీర్మానం పెట్టగా వీగిపోయింది. అప్పుడు లోక్ సభలో ఎన్డీఏకు 325, యూపీఏకు 126 మంది ఎంపీలు ఉన్నారు.
బీఆర్ఎస్ తరఫునా నోటీసులు
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు బీఆర్ఎస్ కూడా నోటీసులు ఇచ్చింది. లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ కు ఈ మేరకు తీర్మాన కాపీని ఆ పార్టీ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వర్ రావు అందజేశారు. నామాతో పాటు బీఆర్ఎస్ లోక్‌సభ ఎంపీలు రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, పసునూరి దయాకర్, ఇతర ఎంపీలు ఉన్నారు. బీఆర్ఎస్ తీర్మానం కాపీపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కూడా సంతకం చేశారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ.. దేశ సమస్యలు, మణిపూర్ అల్లర్లు, కేంద్ర వైఫల్యాలపై చర్చ జరిగేలా చూసేందుకే అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు చెప్పారు. ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. మణిపూర్ హింసపై ప్రధాని మౌనం వీడాలని డిమాండ్ చేశారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుందన్నారు. అయితే, తాము ఏ కూటమిలోనూ లేమన్నారు.
ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై బీఆర్ఎస్ విప్ జారీ
ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఆ పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేసింది. దీనిపై ఎంపీ జోగినపల్లి సంతోష్ సంతకంతో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లెటర్ హెడ్ తో ఉన్న లేఖను రిలీజ్ చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం ఏ సమయంలో అయినా ఉభయ సభల్లో ఢిల్లీ సర్వీసెస్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు 26, 27, 28 తేదీల్లో తప్పక అందుబాటులో ఉండాలి. ఈ మూడు రోజులు బిల్లులపై ఓటింగ్ పూర్తయ్యే వరకు సభలోనే ఉండాలి’ అని లేఖలో పేర్కొన్నారు.
దేశ చరిత్రలో 28వ అవిశ్వాసం
దేశ చరిత్రలో కేంద్ర ప్రభుత్వంపై ఇది 28వ అవిశ్వాస తీర్మానం. మొదటిసారిగా1963లో నెహ్రూ ప్రభుత్వంపై ఆచార్య జేబీ కృపలానీ లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అది వీగిపోయింది. అత్యధికంగా ఇందిరాగాంధీ15 సార్లు అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొని అన్నింట్లోనూ గెలిచారు. లాల్ బహదూర్ శాస్త్రి , పీవీ నరసింహారావు 3 సార్లు చొప్పున, అటల్ బిహారీ వాజ్‌పేయి, మొరార్జీ దేశాయ్ 2 సార్లు చొప్పున, జవహర్‌లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, మన్మో హన్ సిం గ్ ఒక్కొక్క సారి అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నారు.1999లో వాజ్‌పేయి ఒక ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి అధికారం కోల్పోయారు.
లోక్‌సభలో పార్టీల బలాలు ఇలా..
అధికార ఎన్డీఏ కూటమి: 331 (స్పీకర్ తో కలిపి) బీజేపీ– 301, శివసేన 13, ఆర్ఎల్ జేపీ– 5, ఏడీపీ– 2, రాంవిలాస్ పార్టీ–1, అజిత్ పవార్ కూటమి– 1, ఏజేఎస్ యూ– 1, ఎన్డీపీపీ– 1, ఎపీఎఫ్– 1, ఎపీపీ– 1, ఎస్కేఎం –1, ఎంఎన్ఎఫ్ – 1, ఇండిపెండెంట్లు (సుమలత, నవనీత్ కౌర్)– 2
ఎన్డీఏకు బయటి నుంచి మద్దతు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ- 22
ప్రతిపక్షాల ఇండియా కూటమి: 142 కాంగ్రెస్–50, డీఎం కే– 24, టీఎం సీ– 23, జేడీయూ–16, శివసేన (ఉద్దవ్ థాక్రే)– 6, శరద్ పవార్– 4, ఎస్పీ– 3, సీపీఎం– 3, సీపీఐ– 2, ఆప్– 1, జేఎంఎం– 1, ఆర్ఎస్పీ– 1, వీసీకే– 1, కేరళ కాం గ్రెస్ (మణి)– 1ఇండియా’కు బయట నుంచి మద్దతు: బీఆర్ఎస్ – 9, ఎంఐఎం–2
