కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. చెప్పులు కూడా వేసుకోనని శపథం..

చెన్నై: తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై తనను తాను కొరడాతో కొట్టుకున్నారు. కోయంబత్తూర్లోని ఆయన నివాసంలో మీడియా ఎదుటనే ఎనిమిది కొరడా దెబ్బలతో తన శరీరాన్ని గాయపరుచుకున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ఆయన కొరడా ఝుళిపించుకోవడంతో జర్నలిస్టులు, కెమెరామెన్లు విస్తుపోయారు.

అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసును డీల్ చేయడంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని, పోలీసుల తీరుకు నిరసనగా ఆయన ఇలా కొరడాతో కొట్టుకున్నారు. లైంగిక వేధింపులకు గురైన బాధిత యువతి పేరును, ఫోన్ నంబర్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని పోలీసులు బయటపెట్టారని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు మండిపడ్డారు. ఎఫ్ఐఆర్ను పబ్లిక్ డొమైన్లో ఎలా అందుబాటులో ఉంచుతారని ప్రశ్నించారు. 

ఎఫ్ఐఆర్ను అందుబాటులో ఉంచడం ద్వారా బాధితురాలి వివరాలను లీక్ చేసినట్టయిందని పోలీసులపై అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ కూడా బాధితురాలిని కించపరిచే విధంగా రాశారని.. అలా ఎఫ్ఐఆర్ రాయడానికి, బయటపెట్టడానికి డీఎంకే సిగ్గుండాలని ఆయన దుయ్యబట్టారు. తమిళనాడు న్యాయ శాఖ మంత్రి ఎస్ రఘుపతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నిర్భయ ఫండ్స్ ఏమయ్యాయి..? అన్నా యూనివర్సిటీ క్యాంపస్లో సీసీటీవీ కెమెరా ఎందుకు లేవు..?’ అని అన్నామలై నిలదీశారు.

Also Read :- ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

ఇదిలా ఉండగా.. అన్నామలై చేసిన తాజా శపథం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే దాకా తాను చెప్పులు వేసుకోనని అన్నామలై ప్రతిన పూనారు. తాను చెప్పులు వేసుకోను కాబట్టి బీజేపీ కేడర్ను కూడా చెప్పులు వేసుకోకండని చెప్పడం లేదని ఆయన వివరణ ఇచ్చారు. 48 రోజుల పాటు నిరాహార దీక్షకు దిగనున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి రెండో వారంలో తాను ‘అరుపడై వీడు మురుగన్’ (మురుగన్ ఆరు దేవాలయాలు) సందర్శనకు వెళతానని, తమిళనాడులోని పరిస్థితులను మురుగన్తో మొరపెట్టుకుంటానని అన్నామలై తెలిపారు. అన్నా యూనివర్సిటీలో జరిగిన ఘటనకు బాధ్యులుగా చెన్నై సిటీ పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ విధుల నుంచి తప్పుకోవాలని తమిళనాడు బీజేపీ చీఫ్ డిమాండ్ చేశారు.

అన్నా యూనివర్సిటీలో అసలు ఏం జరిగింది..?

తమిళనాడులో అన్నా యూనివర్సిటీలో వెలుగుచూసిన లైంగిక వేధింపుల ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన రాజకీయంగా కూడా పెను దుమారం రేపింది. చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న యువతి డిసెంబర్ 23న సాయంత్రం క్యాంపస్లోనే లైంగిక వేధింపులకు గురైంది. బాధిత యువతి డిసెంబర్ 24న ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జ్ఞానశేఖరన్ అనే 37 ఏళ్ల వ్యక్తి తనపై రేప్కు పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఘటన జరిగిన మరుసటి రోజు బాధితురాలు పోలీసులను హెల్ప్ లైన్ ద్వారా కాంటాక్ట్ చేసింది. బాధిత యువతి తన స్నేహితుడితో ఉన్న సమయంలో నిందితుడు వీడియో తీశాడని, ఆ వీడియోను అడ్డం పెట్టుకుని తనను, తన స్నేహితుడిని బెదిరించి తనపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో యువతి తెలిపింది. 

నిందితుడు జ్ఞానశేఖరన్కు నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. గతంలో అతనిపై పలు స్టేషన్లలో 15కు పైగా కేసులు నమోదైనట్లు చెప్పారు. 2011లో ఇదే క్యాంపస్లో అత్యాచారం కేసులోనే నిందితుడు అరెస్ట్ అయినట్లు తెలిసింది. అన్నా యూనివర్సిటీలో విద్యార్థినులకు భద్రత కల్పించడంలో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ విమర్శించింది. అన్నామలై ఈ ఘటనపై ఆందోళనను తీవ్రతరం చేశారు. జ్ఞానశేఖరన్ డీఎంకే కార్యకర్త కావడం వల్లే పోలీసులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నామలై పోలీసులు తీరుపై బాహాటంగానే విమర్శలు చేశారు.