అన్నమయ్య జననం.. పదకవితకు పుట్టినరోజు

భగవద్వైభవాన్ని వర్ణిస్తూ అన్నమాచార్య సంకీర్తనలు విననివారు, తెలియనివారు ఉండరు. ఆయన విశ్వవ్యాపకుడు. ఆయన మేలుకొలుపు ఆలపిస్తేనే కాని శ్రీ వేంకటేశ్వరస్వామి లేచేవాడు కాదట. అలాగే జోలపాడి నిద్ర పుచ్చితేనే కాని నిద్రపో యేవాడు కాదట. అంటే అన్నమయ్య భక్తితత్త్వాన్ని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆస్వాదిం చేవాడని అర్థమవుతోంది. ఆయన శ్రీ మహావిష్ణువును, కలియుగంలో ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని స్తుతించాడు. తన కీర్తనల్లో ఆయన పాడిన రాసిన కీర్తనల్లో ఆధ్యా త్మిక కీర్తనలు, శృంగార కీర్తనలు రెండూ వున్నాయి. ఆయనే రచించి, గానం చేయ డంతో తొలి పద కవితా పితామహుడుగా, తొలి వాగ్గేయకారుడుగా పేరుపొందాడు.

తెలుగు సాహితీ చరిత్రలో తనకంటూ ఒక చరిత్ర లిఖించుకుని తొలి తెలుగు వాగ్గేయకారుడిగా, పదకవితా పితామహుడు అన్నమయ్య జయంతి నేడు ( మే 23). ఆయన పూర్తి పేరు తాళ్ళపాక అన్నమాచార్యులు. ఆయన రాసిన సంకీర్తనలు, సాహితీ చరిత్ర ఆధారంగా లభించిన వివరాల ప్రకారం అన్నమయ్య 1408 వ సంవత్సరంలో వైశాఖ పూర్ణిమా నాడు జన్మించాడు. కడప జిల్లా ప్రస్తుత రాజంపేట నియోజకవర్గం తాళ్ళపాక గ్రామంలో నివసించే నారాయణసూరి, లక్కమాంబనారాయణ సూరి పుణ్య దంపతులకు జన్మించిన శ్రీమహా విష్ణు వరప్రసాదంగా నందకాంశతో జన్మించాడు అనీ అన్నమయ్యను అభివర్ణిస్తారు. 32 వేలకు పైగా సంకీర్తనలు వ్రాసి తెలుగు భాషలోని మాధుర్యాన్ని, భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం వంటి కత్తి లాంటి కీర్తనలు రచించి గానం చేసి శ్రీలక్ష్మి నారాయణులను మెప్పించి ప్రసన్నం చేసుకున్న అసామాన్య భక్తుడు అన్నమయ్య .

నవరసాలను తన పాటలలో, పద్యాలలో పొందుపరచిన గొప్ప పదకవితా పితామహుడాయన. ఆయన రాసిన 32 వేలకు పైచిలుకు సంకీర్తనలలో చాలావరకూ అందుబాటులో లేవు. కేవలం 15 వేల సంకీర్తనలు మాత్రమే మిగిలాయి. ఆయన రాయలసీమకు చెందిన వ్యక్తి కావడంతో రచనల్లో ఎక్కువగా కడప, రాయలసీమ యాసే తాండవించేది. అన్నమయ్య భక్తుడే కాదు.. చైతన్యపరుడు కూడా,.. సంఘ సంస్కర్త, తత్వ బోధి, అన్నమాచార్యులను అంతా వైష్ణవ భక్తుడిగానే చూశారు. వేంకటేశ్వర స్వామిపై ఆయన రాసిన సంకీర్తనలే అందుకు కారణం. నారసింహ, రామ, కృష్ణ, హనుమ అలమేలు మంగలను కీర్తిస్తూ ఎన్నెన్నో కీర్తనలను రచించిన చివరకి అంకితం ఇచ్చింది మాత్రం వేంకటేశ్వరునకే అదీ అతనికి స్వామిపై ఉన్న అనన్య భక్తి ప్రపత్తి కానీ, ఆయన వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధించిన ఓ గొప్ప గురువు. ఒక మనిషి జీవితం ఎలా ఉండాలో, ఒక మనిషి ఎలా మెలగాలో చాటి చెప్తూ ఆయన రాసిన కీర్తనలు  రచనలు ఎన్నెన్నో ఉన్నాయి.

 వ్యక్తిత్వ వికాసానికి సరియైన మార్గదర్శి. అంతెందుకు బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మమొక్కటే… అంటూ ఆయన రాసిన గొప్ప సంకీర్తన అర్ధం మనుషులంతా సమానమేనని  చెప్పే ప్రయత్నం. ఇందులో సామాజిక కోణం దాగి ఉంది. ఊరూరా తిరుగుతూ ఆయన చేసిన కవితలలో జీవన అర్థం, సామాజిక పరమార్థం దాగి ఉన్నాయి. 

మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు సహజి వలె నుండి ఏమి సాధింపలేడు! అంటూ అన్నమయ్య రాసిన సంకీర్తన నేటికీ ప్రతి మనిషిలోనూ ఓ కొత్త ఉత్తేజం నింపుతుంది. ఈ కీర్తన ద్వారా  ఈ లోకంలో మనిషన్నవాడు ఉద్యోగి కావాలి  అని చెప్పుకొచ్చాడు అన్నమయ్య.   ఉద్యోగి అంటే  ఉద్యోగం చేసేవాడు అని అర్ధం కాదు. ఆయన భావంలో  ఉద్యోగి అంటే  ఉద్యమించే వాడు  అని అర్థం. కార్యసిద్ది కోసం ప్రయత్నించేవాడు, ఆ క్రమంలో ఎదురయ్యే కష్టాలకు కృంగిపోకుండా పాటుపడే వాడు అని అర్ధం.

వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ
జాడతో నూరకుండితే జడుడౌను!
ఓడక తపసియైతే ఉన్నతోన్నతుడౌ
కూడక సోమరి ఐతే గుణహీనుడౌను!

అన్నమయ్య కలం నుండి జాలు వారిన ఈ శ్లోకం యొక్క భావం  
 శ్రద్ధతో చేస్తేనే కార్యాలు పూర్తవుతాయని, మొక్కుబడిగా ప్రయత్నిస్తే ఫలితం ఉండదని..  శ్రద్ధగా చదివితే వేదశాస్త్ర పారంగతుడివి అవుతావు, నామమాత్రంగా చదివితే మూర్ఖుడిగా మిగులుతావు అంటున్నాడు అన్నమయ్య.

తపస్సు సాధించాలంటే మనలోని శక్తియుక్తులన్నీ  కూడబెట్టి పరిశ్రమించాలి. సోమరులకి దక్కేది కాదిది. అందుకే  సోమరిగా ఉంటే గుణహీనుడివి అవుతావు  అని పలికాడు అన్నమయ్య. అనాడే చదువు విలువ ఏమిటో, మనిషిలో ఎంతటి మార్పును తీసుకు వస్తుందో తన పదకవితలతో చక్కగా చెప్పాడు అన్నమయ్య. మరి అన్నమయ్య చెప్పేది నిజమేగా మొక్కుబడిగా చదివితే ఏం ప్రయోజనం, శ్రద్దగా చదివితేనే జ్ఞాన గుణ సంపన్నులం కాగలం.

ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో కష్టనష్టాలకు క్రుంగిపోకూడదు అని అన్నమయ్య ఆనాడే వ్యక్తి వికాసానికి దోహదం చేసే ఎన్నో సంకీర్తనలు వ్రాశాడు. అన్నమయ్య రాసిన సంకీర్తనలలో ఎక్కువ శృంగారం గురించే ఉండటం విశేషం. అంటే ఆయన శ్రీ మహావిష్ణువు భక్తుడిగానే కాకుండా.., ఒక మనిషి జీవితంలో వచ్చే నవరసాల భావో ద్వేగాలను కూడా తన రచనలలో ఆనాడే పరిచయం చేశాడు. అన్నమయ్య కీర్తనలను వెంకటేశ్వరస్వామి ముద్రతో రచించి ఆ స్వామికే అంకితంచేసిన ధన్యజీవి.. అన్నమయ్య.   అందుకే వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే అన్నమయ్యను స్మరించినట్లే. అన్నమయ్యను స్మరిస్తే స్వామిని స్మరించినట్లే

ఆయన చూడని కోణం లేదు, చెప్పని విషయం లేదు నిస్వార్థంతో కేవలం స్వామి, అమ్మవార్ల వైభవాన్ని, మహిమలను వారి అలంకారాలను వాహనాలను, ఉత్సవాలను, సేవలను, ఘనతను కీర్తించిన విధానం అసామాన్యం అనితర సాధ్యంకానిది ఈ సృష్టా ఉన్నంత వరకు ఎవరూ అలా రచించలేరు అనినొక్కి చెప్పవచ్చు.. అనన్యం, అద్భుతం అజరామరం, తరాలు మారినా.. యుగాలు మారినా.. వేంకటేశ్వర స్వామి ఉన్నంత కాలం శ్రీ అన్నమాచార్యులస్థానం పదిలం.