రైతులకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తా

రైతులకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తా
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా నెల రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనలు చేస్తున్నారు. వీరికి మద్దతుగా నిరాహార దీక్ష చేపడతానని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తెలిపారు. తన డిమాండ్లను 2021 జనవరిలోగా కేంద్రం అంగీకరించకపోతే తాను చేపట్టే నిరాహార దీక్షయే తన చివరి నిరసన అవుతుందని హెచ్చరించారు. మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్‌ రాలేగావ్‌ సిద్దీ గ్రామంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం మూడేళ్లుగా అనేక నిరసనలు చేపట్టానని.. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం శూన్యమని అన్నారు. ప్రభుత్వం చేస్తూ వస్తోన్న వాగ్దానాలపై తనకు నమ్మకం పోయిందన్నారు. ప్రస్తుతం తన డిమాండ్లకు కేంద్రం ఏ చర్య తీసుకుంటుందో వేచి చూస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం అడిగిన ప్రకారం 2021 జనవరి నెలాఖరు వరకు వేచి చూస్తానని, సానుకూలంగా స్పందించకపోతే నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.